ప్రతీ హీరో మాస్ ఇమేజ్ కోసమే పాకులాడతాడు. ఎందుకంటే అది దక్కితే, ఇక తిరుగు ఉండదు. కథల ఎంపిక మరింత సులభం అవుతుంది. మాస్‌ని మెప్పిస్తే బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించుకోవొచ్చు. రామ్ కూడా అదే చేశాడు, చేస్తున్నాడు. ఒంటి చేత్తో వంద మందిని బాదేయడం, విలన్ ఎంతటి వాడైనా వాడి మెడలు వంచి లొంగ దీసుకోవడం, ఐటెమ్ సాంగులు ఆడేయడం.. ఇదే మాస్ హీరో క్వాలిటీస్ అని రామ్ గట్టిగా నమ్ముతున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ చేసింది అదే. ఆ సినిమా హిట్టయ్యింది. అయితే అదే నమ్ముకొని, తను మాస్ హీరోని అయిపోయానని అనుకొంటే మాత్రం ఫ్లాపు కథలో కాలేసినట్టే.
రామ్ మాస్ ని మెప్పించాలని చేసిన చాలా ప్రయత్నాలు బాక్సాఫీసు దగ్గర పల్టీలు కొట్టాయి. ఒంగోలు గిత్త నుంచి నిన్నా మొన్నటి వారియర్, స్కంద చిత్రాల వరకూ రామ్ ఎంచుకొన్న మాస్ కథలు దారుణమైన ఫలితాల్ని ఇచ్చాయి. రామ్ ఫైట్లూ, మాస్ డైలాగులు చెప్పొచ్చు. అలాంటి సినిమాలు కూడా చూశారు జనం. కానీ మరీ ఓవర్ ది బోర్డ్ సినిమాలు మాత్రం రామ్ కి సరిపడం లేదు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే జీవితం’ ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న కథలు రామ్ చేయగలడు. ఆయా సినిమాలు బాగా ఆడాయి కూడా. రామ్ కి ఇంకా ఏజ్ ఉంది. తను లవ్ స్టోరీలకు బాగా సూట్ అవుతాడు. కానీ మాస్, యాక్షన్ గోలలో తనలోని క్లాస్ ఎటో కొట్టుకెళ్లిపోతోంది. ఇప్పుడు వచ్చిన ఫలితాల్ని రామ్ విశ్లేషించుకొంటే, తనకు మాస్ కంటే క్లాస్ కథలే నప్పుతాయన్న నిజం తెలుస్తుంది. రెండు మూడు సినిమాలైనా జోనర్ మార్చి, కథలు ఎంచుకొంటే, కొత్త తరహా రామ్ ని చూసే అవవకాశం దక్కుతుంది. రామ్ ని అభిమానించే వాళ్లు కూడా ఇదే అంటున్నారు. ”మాస్ కథలు చేయడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. మాకు ‘నేను – శైలజ’ లాంటి సినిమాలు కావాలి” అని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ మాటలు రామ్ కి వినిపిస్తున్నాయో లేదో..?