ఇమాన్వీ ఎస్మాయిల్… నిన్నా మొన్నటి వరకూ ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తను ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్. ప్రభాస్ సినిమాలో ఇమాన్వీ అనగానే సోషల్ మీడియా ఫోకస్ అంతా ఈ భామపైనే. ఇమాన్వీ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ ఆరాలు మొదలైపోయాయి. దాంతో ఒక్క రోజులోనే ఇమాన్వీ స్టేటస్ మారిపోయింది. ఇన్ స్టాలో ఏకంగా లక్షమంది ఫాలోవర్ల ఒకే ఒక్క రోజులో పెంచుకొంది. తన పాత వీడియోలు, రీల్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ కు చెందిన బడా నిర్మాణ సంస్థలు కూడా ఇప్పుడు ఇమాన్వీపై ఫోకస్ చేశాయి. ప్రభాస్ సినిమా మొదలయ్యేలోగానే, ఇమాన్వీ తదుపరి సినిమా బ్లాక్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదంతా ప్రభాస్ పుణ్యమే.
నిజానికి ఈ సినిమా కోసం హను రాఘవపూడి చాలామంది కథానాయికల పేర్లని పరిశీలించాడు. మృణాల్ ఠాకూర్, త్రిష పేర్లు దాదాపుగా ఖాయమయ్యాయి. అయితే ఈ సినిమాకు కథానాయిక ఎవరైనా సరే, బల్క్‌గా డేట్లు కావాలి. ఎప్పుడంటే అప్పుడు సెట్ కి రావాలి. కాస్త బిజీగా ఉండే కథానాయికలకు అది సాధ్యం కాదు. అందుకే కొత్తమ్మాయిపై దృష్టి పెట్టాడు హను. దాదాపు 100మందిని ఆడిషన్స్ చేసి చివరికి ఇమాన్వీని ఎంచుకొన్నార్ట. ఈ సినిమా పూర్తయ్యేంత వరకూ మరో సినిమా ఒప్పుకోకూడదన్న కండీషన్‌తోనే ఇమాన్వీని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొన్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీస్‌లోనే మూడు సినిమాలు చేయాలన్న ఒప్పందం కూడా కుదిరిందట. మైత్రీలో మూడు సినిమాలు పూర్తయ్యాకే ఇమాన్వి మిగిలిన సినిమాలు ఒప్పుకోవాలి. మైత్రీ ఎప్పుడూ పెద్ద సినిమాలపైనే ఫోకస్ పెడుతుంది. ప్రభాస్ పక్కన నటించి, వెంటనే చిన్నా చితకా హీరోల పక్కన చేయలేదు ఇమాన్వి. కచ్చితంగా తన ప్రయాణం స్టార్ హీరోలతోనే ఉంటుంది. ఆ లెక్కన తొలి సినిమా క్లాప్ కొట్టినప్పుడే తాను స్టార్ హీరోయిన్ అయిపోయింది.