ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి రష్యా దాని మిత్ర రాజ్యాలు, అగ్రరాజ్యాలు నెలల తరబడి వారి స్థావరాలపై ఎన్ని వైమానిక దాడులు చేస్తున్నా వారిని తుడిచిపెట్టలేకపోతున్నాయి. పైగా వారి వైమానిక దాడులకు ప్రతీకార చర్యలుగా ఐసిస్ ఉగ్రవాదులు నరరూప రాక్షసులులాగ తయారయ్యి సామాన్య పౌరులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు శనివారం ఉదయం ఇరాక్ లోని కిర్ కుక్ నగరంలోని తజా అనే చిన్న పట్టణంపై రెండు రసాయన బాంబులు ప్రయోగించారు.
తజా పట్టణ శివార్లలో కాపలా కాస్తున్న సమీర్ వైస్ అనే సెక్యూరిటీ గార్డు మూడేళ్ళ చిన్నారి పాప రసాయన దాడిలో అతి భయానకంగా మరణించింది. సుమారు 600 మంది పౌరులు గాయపడ్డారు. అనేక వందల మంది భయంతో పట్టణం విడిచి పారిపోయారు. ఆ చిన్నారిని అతను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించేడు కానీ ఫలితం లేకపోయింది. మొదట ఆమె రెండు కళ్ళు ఉబ్బిపోయాయి. తరువాత ఆమె చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం మొదలయింది. మరి కాసేపటికి ఆమె శరీరం నల్లగా మాడిపోయినట్లు తయారయింది. చాలా సేపు ఆ నరకం అనుభవించిన తరువాత పాప బాధతో విలవిలాడుతూ చనిపోయిందని సమీర్ వైస్ కన్నీళ్లు కార్చుతూ చెప్పాడు.
ఈ రసాయన దాడికి గురయినవారి శరీరంలో చాలా వేగంగా నీటి శాతం తగ్గిపోయి డీ హైడ్రేషన్ కి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు , కళ్ళు ఉబ్బి పోవడం, చర్మం కమిలిపోవడం వంటి లక్షణాలు కనబడ్డాయని వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్పారు.
ఈ దాడి చేసిన వారిని ఉపేక్షించబోమని, వారికి తగిన విధంగా బుడ్డి చెప్పి తీరుతామని ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్-అబ్ది చెప్పారు. గాయపడిన వారిలో కొంతమంది ఆరోగ్యం చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.