తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని తప్పించవచ్చంటూ కథనాలు రావడం ఆయన జరక్కపోవచ్చని మెత్తగా చెప్పడం ఆసక్తికరం. ఎర్రబెల్లి దయాకరరావుకు కడియంకు కొండా మురళికి మధ్య తీవ్ర వైరుధ్యాలున్నాయనేది బహిరంగ రహస్యం. మరీ ముఖ్యంగా అధికార కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ప్రతిసారీ శ్రీహరితో ఘర్షణ పడటం పరిపాటి. ఇదికొన్నిసార్లు ఎబ్బెట్టుగానూ వుండేది. ఆయన టిఆర్ఎస్లోకి వెళ్లాలనుకుంటే ముందుగా నేనుచేరి ఉన్నత స్థానం సంపాదించడమే వల్లనే ఈ అక్కసు అని శ్రీహరి అంటుంటారు. నిజానికి మొదటి ఉపముఖ్యమంత్రి డా.రాజయ్య స్థానంలో శ్రీహరిని తీసుకోవడం నాటకీయంగా జరిగింది. సీనియర్‌గా ఆయనకు సముచిత గౌరవం లభిస్తున్నది కూడా. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాటతప్పారనేది కెసిఆర్‌పై ఒక విమర్శగా వుంటూనే వుంది. ఉప ముఖ్యమంత్రి దళితులకు ఇచ్చి గౌరవించి ఆ విమర్శను తటస్థపర్చడం కెసిఆర్ రాజకీయ అవసరం. ఇంకా అనేక మందిపై ఆరోపణలున్నా రాజయ్యనే తేలిగ్గా తీసేశారన్న విమర్శలు బలహీనంగానైనా రాకపోలేదు. శ్రీహరిని కూడా తొలగించడమంటే ఆ విమర్శలను నిర్ధారించడమే అవుతుందని కెసిఆర్ వంటి రాజకీయ వేత్తకు బాగా తెలుసు.రాజయ్య విషయంలో చూపిన ఆరోపణల వంటివి శ్రీహరిపై వుండకపోవచ్చు కూడా. ఆయనను తీసుకెళ్లి శాసనమండలి చైర్మన్‌ను చేయడం హాస్యాస్పదంగా వుంటుందని అందరికీ తెలుసు.కనుక శాఖల మార్పులు జరగొచ్చు గాని పూర్తిగా తొలగించి తలనొప్పి కొని తెచ్చుకోరనే అంటున్నారు. పైగా ఎర్రబెల్లికి ఇష్టమైన వారే ఈ విధమైన కథనాలు వదులుతున్నారని కడియం శిబిరం భావిస్తోంది.