కొన్ని సబ్జెక్ట్స్ కి హీరోలు దూరంగా వుంటారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటారు. కానీ కొందరు హీరోలు ఓ అడుగుముందుకేస్తారు. ఇమేజ్ కంటే కొత్తదనం గురించి ఆలోచిస్తారు. ఆ మధ్య ‘హంట్’ సినిమాతో సుధీర్ బాబు పెద్ద ప్రయోగమే చేశాడు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పటికీ సుధీర్ బాబు డేరింగ్ ని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు రాజ్ తరుణ్ అలాంటి సబ్జెక్ట్ తీసుకున్నాడు.
మారుతి సమర్పణలో రాజ్ తరుణ్ చేస్తున్న సినిమా భలే ఉన్నాడే. శివసాయి వర్ధన్ ఈ సినిమాకి దర్శకుడు. తాజాగా ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ లో పాయింట్ రివీల్ చేశారు. రాజ్ తరుణ్ పాత్రకు అమ్మాయిలంటే ఫీలింగ్స్ వుండవు. తనని అందరూ మగతనం లేని వాడని వెక్కిరిస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది హీరోయిన్. అసలు అమ్మాయిలంటే ఇష్టంలేని వాడితో ఆ కాపురం ఎలా సాగింది? అసలు హీరో సమస్య ఏమిటి? ఎందుకు? అనేది మిగతా కథ.
మారుతి కాన్సెప్ట్ లన్నీ వెరైటీగా వుంటాయి. ఇందులోనూ అలాంటి షాకింగ్ ఎలిమెంట్ ఏదో వుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఆడియన్స్ దృష్టిని ఆకర్షించే పాయింటే ఇది. మారుతి స్టయిల్ లో చాలా సరదాగా సాగినప్పటికీ చివర్లో ఎదో ఎమోషనల్ ఎలిమెంట్ వుంది. ముఖ్యంగా ఇలాంటి పాయింట్ తో రావడం రాజ్ తరుణ్ డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ఈ సినిమా రాజ్ కెరీర్ కి చాలా కీలకం. వరుస అపజయాలతో డీలా పడ్డ రాజ్ కి ఈ సినిమా ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి. వినాయక చవితి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.