వైసీపీ హయాంలో డిప్యూటేషన్ పై వచ్చిన చాలా మంది చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వీరిలో తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అనే ఆఫీసర్ ది ఓ రకమైన దోపిడీ. జగన్ గెలవగానే ఊడి పడిన ఆయన… ఒక్క తన శాఖ నుంచే ఐదేళ్లలో సాక్షి పత్రికకు ఐదు వందల కోట్ల వరకూ ప్రకటనలు ఇచ్చారు. మిగతా పత్రికలు, చానల్స్ అన్నింటికీ కలిపి నాలుగు వందల కోట్లు కూడా ఇవ్వలేదు.
పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలంటే స్పష్టమైన నిబంధనలు ఉంటాయి కానీ .. తమ పాలనలో రూల్స్ అంటే.. తాము పెట్టుకున్నవేనని… డిసైడయిపోయి.. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లుగా స్వాహా చేశారు. అందులో తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి కీలక పాత్ర. జగన్ కు తిరుగులేని మళ్లీ గెలుస్తారని చెప్పి ఆయన ఫలితాలకు ముందే రెండేళ్ల పాటు డిప్యూటేషన్ పొడిగించుకున్నారు. కానీ ఓడిపోవడంతో.. వెంటనే డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆయన ఎలా చేరిపోయారో కానీ.. తన మాతృసంస్థ సమాచారశాఖలో కోల్ కతాలో చేరిపోయారు.
ఆయన వెళ్లిపోయిన దాదాపుగా నెల తర్వాత ఇప్పుడు .. ఏపీ ప్రభుత్వం ఆయనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. క్విడ్ ప్రోకో, సాక్షికి లబ్ది చేకూర్చడం , అవినీతి పై విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ విషయాన్ని ఆయన ప్రస్తుతం పని చేస్తున్న కేంద్ర సమాచార శాఖకు తెలియచేయనున్నారు.