మా సోదరికి బెయిల్ వస్తుంది… సుప్రీంకోర్టు మా వేదనను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాం… అంటూ కొన్ని రోజులుగా మాజీ మంత్రి కేటీఆర్ పదేపదే కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే కింది కోర్టులు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన నేపథ్యంలో, మంగళవారం సుప్రీంకోర్టులో రెగ్యూలర్ బెయిల్ పై విచారణ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత 150రోజులకు పైగా తీహార్ జైల్లో ఉంది. స్కాంలో ఉన్న కింగ్ పిన్స్ లో కవిత కూడా ఒకరని, సౌత్ గ్రూప్ ను లీడ్ చేసింది కవిత అంటూ ఈడీ, సీబీఐలు ఆరోపిస్తున్నారు.
ఈడీతో పాటు జైల్లోనే సీబీఐ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో… అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలని, తాను మహిళగా, ప్రజా ప్రతినిధిగా బెయిల్ పొందేందుకు అర్హురాలిని అంటూ కవిత వాదిస్తున్నారు. ఇటీవల ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్ ఇస్తూ, ఎక్కువ రోజులు ఓ వ్యక్తిని కేవలం ఆరోపణలతోనే జైల్లో ఉంచలేమని కామెంట్ చేయగా… ఇప్పుడు ఇదే అంశాన్ని కవిత లాయర్లు ప్రస్తావిస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ పలు దశలుగా ముకుల్ రోహత్గీతో చర్చలు జరిపారు. ఆ తర్వాతే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయటంతో పాటు కింది కోర్టుల్లో ఉన్న ఇతర పిటీషన్లను ఉపసంహరించుకున్నారు.
ఇక ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా… రెండు ఒకేసారి జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ముందు విచారణకు రానున్నాయి. గత విచారణలో ఇదే ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ, పూర్తి స్థాయి వాదనలు విన్నాకే బెయిల్ పై నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన నేపథ్యంలో… మంగళవారం విచారణపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.