ఇటీవలి భారీ వర్షాలతో తుంగభద్రకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఇలాంటి దశలో విజయవంతమైన ఇంజినీర్ గా పేరొందిన కన్నయ్యనాయుడును పంపి గేటును బిగించారు. ఈ విషయాన్ని సోమశిల ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొనడంతో ఎవరీ కన్నయ్యనాయుడు అని చెవులు కొరుక్కుంటున్నారు.
కన్నయ్యనాయుడు.. తెలుగునాట పుట్టి , కన్నడనాట ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకున్న రిటైర్డ్ ఇంజినీర్. చిత్తూర్ జిల్లా గుడిపాల మండలం రాసానపల్లెలో ఓ రైతు కుటుంబంలో 1946లో జన్మించిన ఆయన..శ్రీ వెంకటేశ్వర్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
ఆ తర్వాత తమిళనాడులోని సదరన్ స్ట్రక్చర్ కంపెనీలో పని చేశారు. హోసపేటే సమీపంలోని తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లో చేరారు. డిజైన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా, సీనియర్ మేనేజర్ గా 2002 వరకూ అంటే పాతికేళ్ళు పని చేశారు.
కన్నయ్యనాయుడు దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా ప్రాజెక్టుల గేట్ల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. కర్నాటకతోపాటు ఉమ్మడి రాష్ట్రంలోని నాగార్జున సాగర్ , శ్రీశైలం , జూరాల ప్రాజెక్టు గేట్ల నిర్మాణం, మరమ్మత్తులోనూ పని చేశారు. ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం తగ్గకుండానే గేటుకు మరమ్మత్తులు చేయించారు కన్నయ్యనాయుడు. ఈ క్రమంలోనే ఇటీవల తుంగభద్ర డ్యాంకు గేటు బిగించి చంద్రబాబు నుంచి ప్రశంసలు అందుకున్నారు.