హైదరాబాద్ మునిగిపోకుండా ఉండేందుకు చెరువును కాపాడేందుకు రంగంలోకి దిగిన హైడ్రా పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. చెరువుల్లోకి దిగి మరీ చేస్తున్న కట్టడాలను ఎప్పటికప్పుడు కూల్చేస్తున్నారు. పరిమితమైన వనరుసతో హైడ్రా కమిషనర్ రంగనాథ్.. దడ పుట్టిస్తున్నారు. హైడ్రా పనితీరును కబ్జాదారులు తప్ప అందరూ స్వాగతిస్తున్నారు. అన్ని పార్టీల నేతలూ అక్రమ కట్టడాలను కూల్చేయాల్సిందే అంటున్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. వారిలో బీఆర్ఎస్ ఉండటమే అసలు విషాదం.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెరువుల కబ్జాలను వదిలేది లేదని. నాలాలను మింగిన వారిని కూడా వదిలి పెట్టబోమని భీకరమైన ప్రకటనలు చేశారు. వర్షం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ మునిగిపోతూంటే… ప్రాణాలు బలైనప్పుడల్లా ఇలాంటి ప్రకటనలు చేసేవారు. కానీ కనీస చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. మొత్తంగా పదేళ్ల పాలనలో చెరువులన్నీ చిక్కిపోయాయి. బీఆర్ఎస్ నేతలకు వెంచర్లు అయ్యాయి.. చెరువుల ఒడ్డున ఫామ్ హౌస్లయ్యాయి.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కబ్జాలపై విరుచుకుపడుతూంటే.. హైడ్రాను నిందించేందుకు .. కూల్చివేతలు లేకుండా ఒత్తిడి తెచ్చేందుకు రంగంలోకి దిగిపోయారు. కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లంటూ హడావుడి చేయడం ప్రారంభించారు. దానం నాగేందర్, మజ్లిస్ ఎమ్మెల్యేలను కూడా ఈడ్చి అవతల పడేసి కబ్జాలను కూలగొట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆయనకు సీఎం రేవంత్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నిజంగా చెరువులను కబ్జా చేసి ఉంటే…వాటికి ముహుర్తం ఖరారవుతుంది. కానీ ఎందుకు బీఆర్ఎస్ నేతలు ముందస్తుగా టెన్షన్ పడుతున్నారన్నది కీలకం.
ఇప్పుడు బీఆర్ఎస్ తీరు వల్ల కబ్జాదారులకు బీఆర్ఎస్ అండగా ఉంటోందన్న అభిప్రాయం బలపడుతుంది . ఇలాంటి ఇమేజ్ ఏ పార్టీకి అయినా మంచిది కాదు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. అధికారం ఎలాగూ లేదు.. కబ్జాలు చేసిందయినా కాపాడుకుందామన్నట్లుగా వారి తీరు ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.