ప్రతీ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర బడా చిత్రాలు పోటీ పడడం రివాజు. 2025 సీజన్ కూడా ఎప్పటిలా వాడీ వేడిగా ఉండబోతోంది. ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ సంక్రాంతి పోటీకి ‘సై’ అంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా కూడా ఈ సీజన్లోనే రాబోతోంది. ఇప్పుడు బాలకృష్ణ కూడా సంక్రాంతి సమరానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ – బాబి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూపొందిస్తోంది. ఈ దసరాకి గానీ, ఈ యేడాది చివర్లో గానీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనుకొన్నారు. కానీ ఇప్పుడు ప్లానింగ్ మారింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికే తీసుకురావాలని బాలయ్య ఫిక్సయ్యారు. సో… ఈ సంక్రాంతి పోటీకి మరో సినిమా కూడా రెడీ అయినట్టే.
సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా అందరి దృష్టీ చిరంజీవి – బాలకృష్ణ సినిమాలపై పడడం సహజం. సమ ఉజ్జీలు ఇద్దరు బరిలోకి దిగితే – ఆ మజానే వేరు. అయితే సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఢీ కొట్టడం ఇదే తొలిసారి కాదు. ఇది వరకూ ఈ పోటీని ఫ్యాన్స్ ఆస్వాదించారు. 1985 సంక్రాంతికి చిరంజీవి ‘చట్టంతో పోరాటం’ సినిమాతో వస్తే, అదే సీజన్లో బాలయ్య ‘ఆత్మబలం’ వదిలారు. 1987 లో చిరు ‘దొంగ మొగుడు’ అవతారం ఎత్తితే, బాలయ్య ‘భార్గవ రాముడు’గా దర్శనమిచ్చాడు. రెండూ హిట్లే. అయితే ‘దొంగ మొగుడు’ కమర్షియల్ గా ఇంకా బాగా ఆడింది. 1988లో చిరు ‘మంచి దొంగ’, బాలయ్య ‘ఇన్స్పైక్టర్ ప్రతాప్’గా మారిపోయారు. మరుసటి యేడాది చిరంజీవి ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’ సంక్రాంతికే విడుదల చేశారు. అదే సమయంలో బాలయ్య ‘భలే దొంగ’ వచ్చింది. ఈసారి కూడా బాలయ్యపై చిరుదే పై చేయి.
1997లో చిరంజీవి ‘హిట్లర్’గా వస్తే, బాలయ్య ‘పెద్దన్నయ్య’గా మారిపోయాడు. రెండూ అన్నయ్య కథలే. రెండూ హిట్లే. 2017లో చిరు ‘ఖైదీ నెం.150’తో రీ ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో బాలయ్య తన 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ విడుదల చేశారు. రెండూ మంచి విజయాన్ని అందుకొన్నాయి. 2023లో చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండూ కమర్షియల్ గా బాక్సాఫీసు దగ్గర ఆదరణ సంపాదించాయి. ఇప్పుడు 9వ సారి… చిరు, బాలయ్య పోటీ పడబోతున్నారు. ఈసారి ఎవరిది పై చేయి అవుతుందో?!