మహానటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక కొన్ని ప్రత్యేకతలు సాధించుకున్న మాట నిజమే గాని అస్సలు నెరవేరనిది ఒకటుంది. పార్టీ విజయం సాధించిన తర్వాత కొన్నాళ్లకు ఆయన ‘భారత దేశం’ అనే పార్టీని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ మేరకు సంకేతాలిచ్చారు కూడా. అయితే రాజకీయ సలహాదారులతో చర్చించిన తర్వాత అది జరిగేపని కాదని వాయిదా వేసుకున్నారు. అయినా తన సీనియర్ ఎంజిఆర్లాగా రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. విజయవాడలో అపూర్వమైన ఏకైక అఖిలభారత రాజకీయ సమ్మేళనం నిర్వహించారు. తర్వాత నేషనల్ ప్రంట్ అద్యక్షుడుగా పనిచేశారు. అయితే ఫ్రంట్‌లో ప్రధాన పార్టీగా వున్న జనతాదళ్ ఉత్తరాదిన విజయం సాధించింది గాని దక్షిణంలో డిఎంకె, టిడిపి వంటివి ఓడిపోయాయి. అయినా విపిసింగ్ ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ను ఉప ప్రధానిని చేసేందుకు చంద్రబాబు నాయుడు వంటివారు కొంత విఫల యత్నం చేశారు. అప్పట్లో దేవీలాల్‌ను ఉపప్రధానిగా చేసుకున్నందుకే నానా అవస్థలు పడుతున్న విపిసింగ్ ఆ ప్రతిపాదనను బొత్తిగా పట్టించుకోలేదు. పైగా ఆ రోజుల్లో ఢిల్లీలో చంద్రబాబు కన్నా ఉపేంద్ర పాత్ర ఎక్కువగా వుండేది. ఆయననే విపిసింగ్ కేంద్రంలోకి తీసుకుని ఎన్టీఆర్‌కు సమాచారమిచ్చారు. 1996 యునైటెడ్ ఫ్రంట్ హయాంలో చంద్రబాబు కన్వీనర్‌గా వున్నా హరికిషన్ సింగ్ సూర్జిత్ పాత్రే కీలకంగా వుండేది. అయినా ప్రధాని రాష్ట్రపతి పదవులకు పేర్లను ప్రకటించేఅవకాశం చంద్రబాబుకే ఇచ్చారు. తననే ప్రధానిగా రమ్మంటే నిరాకరించానని ఆయన చెబుతుంటారు గాని దానికి ఆ ప్రభుత్వ పరాధీనతే ముఖ్యకారణం తప్ప త్యాగనిరతి కాదు. దేవగౌడ సాహసం చేశారు. తర్వాత చాలా పరిణామాలు చూశాం. ఇక ప్రస్తుతానికి వస్తే రాష్ట్ర విభజన తర్వాత తమది జాతీయ పార్టీగా మారుతుందని తెలుగుదేశం నేతలు చెబుతూ వచ్చారు. ఎపిలో అధికారంలోకి రావడం, తెలంగాణలోనూ పదిహేను స్థానాలు రావడంతో ఆ వాదన బాగానే వుందనిపించింది. అంతేగాక అండమాన్ నికోబార్‌తో సహా ఒకటి రెండు చోట్ల స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి స్థానాలు సంపాదించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌ను నియమించారు కూడా. అయితే ఈ లోగానే అనుకోని రీతిలో తెలంగాణలోనే ఆ పార్టీ దారుణంగా దెబ్బతినిపోయింది. 12 మంది ఎంఎల్ఎలు టిఆర్ఎస్లో చేరిపోయారు. ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం తెచ్చుకోలేకపోయింది.తెలంగాణలోనే నిలబెట్టుకోలేనప్పుడు తెలుగుదేశంను జాతీయ పార్టీగా విస్తరించుకోవడం నెరవేరని స్వప్నమే అవుతుంది. దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ రెండు చోట్ల ప్రధాన శక్తిగా వుండటం ఎక్కడా చూడం గనక నెమ్మదిగా తెలుగుదేశం ఎపికే పరిమితం కావడం అనివార్యంగా జరగొచ్చు. కమ్యూనిస్టులను ఎంతగా ఎగతాళి చేసినా రెండు మూడు రాష్ట్రాలలో అధికారం లోకి రావడంలోని ప్రత్యేకత ఇక్కడ అర్థమవుతుంది. . ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా అస్సాంలో కొంత అవకాశం వుండగా కేరళలోనూ 70 చోట్ల పోటీ చేస్తున్నది. తాను భీమవరంలో పోటీ చేయొచ్చని కొంతకాలం కిందట తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్న మాట ఇక్కడ సరదాగా గుర్తు చేసుకోవచ్చు. ఏమైనా ఈ నేపథ్యంలో జాతీయ ప్రభావం కోసం తెలుగుదేశం ప్రయత్నాలు కొనసాగిస్తుందా లేదా అనేది చూడాల్సిందే. ఎంత చేసినా అది ఫలించడం మాత్రం కష్టమే.