రజనీకాంత్ సినిమా వస్తోందంటే హై ఎలెర్ట్ మొదలైపోతుంది. థియేటర్లకు అదో పండగ. ‘రజనీ సినిమా వస్తోంది మాకు సెలవు కావాలి’ అంటూ స్కూలు పిల్లల దగ్గర్నుంచి సాఫ్ట్ వేర్ కుర్రాళ్ల వరకూ వినతి పత్రాలు అందించడం, ఆ రోజు ఆ ప్రకటిత నేషనల్ హాలీడే లా మారిపోవడం తెలిసిన విషయాలే. రజనీ సినిమా అంటే అటు వారం, ఇటు వారం మరో సినిమా కనిపించేది కాదు. సూపర్ స్టార్ ని ఢీ కొట్టే ధైర్యం, తెగువ ఏ హీరో చేయలేదు.
అయితే ఇప్పుడు రజనీ అంటే భయం పోయిందా? మిగిలిన హీరోలు రజనీని లైట్ తీసుకొంటున్నారా? అనే అనుమానాలు వేస్తున్నాయి. రజనీ సినిమా ‘వేట్టాయన్’ అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సరిగ్గా అదే రోజున సూర్య ‘కంగువా’ విడుదలకు సిద్ధమవుతోంది. వాస్తవానికి సూర్య సినిమా రిలీజ్ డేట్ ని ముందే ప్రకటించారు. ఆ తరవాత రజనీ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. రజనీ సినిమా వస్తోందంటే ‘కంగువా’ వాయిదా వేస్తారేమో అనుకొన్నారంతా. కానీ ‘కంగువా’ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అనుకొన్న సమయానికే ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. సో.. ఈసారి బాక్సాఫీసు దగ్గర పోటీ తప్పదన్నమాట.
Also Read : వెండితెర ‘యువరాజు’ ఎవరు ?
రజనీ సినిమాలు ఇది వరకటిలా బాక్సాఫీసుని షేక్ చేయడం లేదు. రజనీ సినిమా వసూళ్ల వర్షం కురిపించి చాలా కాలమైంది. ఈమధ్య వరుస ఫ్లాపులు రజనీ ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తున్నాయి. అందుకే సూర్య కూడా తన సినిమా విషయంలో వెనక్కి తగ్గడం లేదు. పైగా సూర్య ‘కంగువా’ చిత్రానికి మంచి బజ్ ఉంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన రావడం ‘కంగువా’ బృందానికి కావల్సినంత ధైర్యాన్ని ఇచ్చింది. ‘వేట్టయాన్’లో ఏముంది? ఈ సినిమా దమ్మెంత అనే విషయాలేవీ ఇప్పటి వరకూ తెలీలేదు. ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ ఏదీ బయటకు రాలేదు. అందుకే ‘వేట్టయాన్’ విజృంభణని సినిమా వాళ్లే కాదు, అభిమానులూ ఊహించలేకపోతున్నారు. రెండు సినిమాలూ ఒకేసారి వస్తే, ఈ రెండు చిత్రాలకూ ఇబ్బందే. వసూళ్లు, థియేటర్లు పంచుకోవాలి. తెలుగులో మరింత క్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది. దసరాకు తెలుగు నుంచి కూడా కొత్త సినిమాలు వస్తాయి. అప్పుడు ఇక్కడ థియేటర్లు దొరకడం ఇంకా గగనం అయిపోతుంది. ఈ ఒడిదుడుకుల్ని ఈ రెండు చిత్రాలూ ఎలా తట్టుకొంటాయో చూడాలి.