ఏపీలో కూటమి పార్టీలు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని హమీ ఇచ్చాయి. అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ సౌకర్యం ఇస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎన్నికల సభల్లో ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల హమీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండగా, ఫ్రీ బస్ పై ఎటూ తేల్చలేదు.
రవాణా శాఖపై రివ్యూ సమయంలో ఫ్రీ బస్ స్కీంపై నిర్ణయం తీసుకొని, ఆగస్టు 15 నుండి అన్న క్యాంటీన్లతో పాటే అమలు చేస్తారని అంతా భావించారు. కానీ వాయిదా పడింది. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ పథకాన్ని ఏపీ రవాణా శాఖ అధికారులు ఇప్పటికే స్టడీ చేసి, ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు.
అయితే, ఈ ఆలస్యానికి కారణం బస్సుల సంఖ్యేనని తెలుస్తోంది. ఫ్రీ బస్ అమలైతే మహిళల సంఖ్య బాగా పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం వద్ద బస్సులు లేవు. ఇప్పుడున్న 10వేల బస్సుల్లో దాదాపు 2వేలు అద్దె బస్సులు. మిగిలిన 8 వేల బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే. వాటి స్థానంలో గత సర్కార్ ఎప్పుడూ కొత్తవి కొనలేదు. దీంతో కొత్తవి కొంటే కానీ ఆర్టీసీ గాడిన పడని పరిస్థితి నెలకొంది. పైగా గత సర్కార్ నుండి చెల్లించాల్సిన బకాయిలు పేరుకపోయాయి.
ఫ్రీ బస్ పథకం పెట్టి సరైన బస్సులు లేకపోతే… పథకం ఇచ్చిన దాని కన్నా ఎక్కువ బద్నాం అవుతాం. కొత్త బస్సులు వచ్చాక లేదా అద్దె బస్సుల సంఖ్య పెంచాక పథకం అమలు చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా రవాణా శాఖతో సీఎం చంద్రబాబు మరోసారి భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో ఫ్రీ బస్ ఎప్పటి నుండి అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతి నెల ఈ పథకానికి ప్రభుత్వం నుండి ఆర్టీసీకి కనీసం 300కోట్లు ఇవ్వాల్సి వస్తుందని ఓ అంచనా.