కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విపక్షాల డిమాండ్లను తరచూ వింటున్నారు. అమలు చేస్తున్నారు కూడా. అంతేనా.. కీలకమైన విషయాల్లో పిలిచి మాట్లాడుతున్నారు. సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. మోదీ 3.0 సర్కారులో వచ్చిన ఈ మార్పు విపక్ష నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
లేటరల్ ఎంట్రీ పేరుతో… కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నత ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవి నిపుణులకు సంబంధించినవి కావడం… పర్మినెంట్ కూడా కాకపోవడంతో రిజర్వేషన్లు లేవు. దీంతో విపక్షాలు ఆందోళన చేశాయి. ఐఏఎస్ అధికారుల స్థానంలో తీసుకుంటూ రిజర్వేషన్లు అమలు చేయరా అని ప్రశ్నించాయి. మోదీ వెంటనే… నోటిఫికేషన్ ఆపేయాలని ఆదేశించారు. నిజానికి ఇది యూపీఏ తెచ్చిన విధానం. ఇప్పుడు అధికారుల కొరత ఉందని నియామకంమ కోసం చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది. అయినా మోదీ పట్టుదలకు పోకుండా క్యాన్సిల్ చేయించారు. రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించాలని యూపీఎస్సీకి సూచించారు.
ఇదే కాదు.. ఇటీవల వక్ఫ్ బోర్డు బిల్లుపై భిన్నాభిప్రాయాలు వస్తే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేశారు. గతంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి నిర్ణయం తీసుకునేవారు కాదు. బలవంతంగా అయినా ఆమోదించుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అదే సమయంలో ఇటీవల బంగ్లాదేశ్ పరిణామాల నేపధ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. రాహుల్ గాందీ అడిగిన ప్రశ్నలన్నింటికీ విదేశాంగ మంత్రి సమాధానం చెప్పారు. ఈ పరిస్థితి డిల్లీ రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
మోదీకి ఈ సారి పూర్తి మెజార్టీ లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ఉన్నారు. అయినా సరే మోదీ ఇలా ప్రజాస్వమ్యబద్దంగా వ్యవహరిస్తారని విపక్షాలు ఊహించలేకపోతున్నాయి . ఇది మోదీ సర్కార్ పై పాజిటివ్ నెస్ పరగడానికి కారణం అవుతోంది.