ప్రభుత్వ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా ఈ విధానాన్ని తెచ్చారు. అయితే ఈ విధానం మంచిదేనా కాదా అన్నదానిపై అనేక సందేహాలు వినియోగదారుల్లో ఉన్నాయి.
ఇంతకు ముందు ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఆస్తి ఉంటే అక్కడే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఏ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ‘ఎనీవేర్’ వ్యవస్థ ద్వారా కల్పించారు. వేరే చోట ఆస్తులు ఉన్న రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ వస్తే…దానికి పెండింగ్ నంబర్ వేసి, ఆ ఆస్తి వివరాలను సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆన్లైన్లో పంపేవాళ్లు. అన్నీ సక్రమంగా ఉన్నాయని మార్కెట్ విలువలతో సహా వివరాలు వస్తే అప్పుడు రిజిస్టర్ చేసేవారు. ఈ విధానాన్ని కూడా మరింత సులభతరం చేయాలని అనుకుంటున్నారు. మొత్తం ఆన్ లైన్లోనే సరి చూసి.. వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని అనుకుంటున్నారు.
కానీ రిజిస్టర్ చేయాలనుకున్న భూమి విషయంలో వివాదం ఉంటే పెద్ద సమస్య అవుతుంది. ఏ డాక్యుమెంట్ ఎక్కడైనా రిజిస్టర్ చేయాలంటే…రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాచారం ఆటోమేటిక్ గా అప్ డేట్ అయితేనే సాధ్యమవుతుంది. కానీ అంతగా అభివృద్ధి చెందలేదు. అందుకే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పెద్దగా సక్సెస్ కాలేదు. పైగా రాజకీయ నేతలు.. పలుుబడి ఉన్నవారు.. భూ దందాలు చేయడానికి ఈ విధానాన్ని వాడుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికీ 95 శాతం మంది ఆస్తుల కొనుగోలుదారులు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా లేరు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొంటున్న ఆస్తిని.. ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఇంకా ప్రజల విశ్వసాం పొందేలేదని అనుకోవచ్చు.