జన్వాడలోని ఫామ్ హౌజ్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. నిబంధనలకు విరుద్దంగా జన్వాడలో ఫామ్ హౌజ్ నిర్మించారని ఆరోపణల నేపథ్యంలో హైడ్రా తనిఖీలకు వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. దీనిపై కేటీఆర్ టీం హైకోర్టును ఆశ్రయించడంతో… హైడ్రా 99జీవో ప్రకారం ముందుకు వెళ్లాలని, డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశించింది.
జన్వాడ ఫామ్ హౌజ్ పై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే కేటీఆర్ మాట్లాడారు. ఆ ఫామ్ హౌజ్ తనది కాదని, తన మిత్రుడిది అని , లీజ్ కు తీసుకున్నానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జన్వాడ ఫామ్ హౌజ్ పై డ్రోన్ ఎగరవేశారు. ఇది కేటీఆర్ ఫామ్ హౌజ్ అని, అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేయడం నేరమని కేసు నమోదు చేసి రేవంత్ ను అరెస్ట్ కూడా చేశారు.
ఆ సమయంలో ఆ ఫామ్ హౌజ్ తనది కాదని కేటీఆర్ ప్రకటించకపోగా.. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలకు ఉపక్రమిస్తుందనే వార్తల నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌజ్ తనది కాదు.. తన స్నేహితుడిది అని ప్రకటించడం గమనార్హం. నిబంధనలకు విరుద్దంగా ఫాం హౌజ్ ఉంటే కూల్చివేతకు స్వయంగా తనే సహకరిస్తానన్నారు.
Also Read : జనంలోకి కేసీఆర్.. ముహూర్తం ఫిక్స్!?
జన్వాడలో ఫామ్ హౌజ్ నిబంధనలకు విరుద్దంగా ఉందా, లేదా అనేది గత కొన్నాళ్లుగా అక్కడే ఉంటోన్న కేటీఆర్ కు తెలియదా? అక్రమ నిర్మాణం అని తేలితే కూల్చివేతకు సహకరిస్తాననడం ఏంటి..?మంత్రిగా పని చేసిన కేటీఆర్ అసలు నిబంధనలను పట్టించుకోకుండానే అక్కడ ఉంటున్నారా..? అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఆ ఫామ్ హౌజ్ కేటీఆర్ దేనని , కూల్చివేతకు భయపడే ఈ పిటిషన్ వేయించారని ఆరోపిస్తున్నారు.
మొత్తానికి.. జన్వాడ ఫామ్ హౌజ్ విషయంలో కేటీఆర్ కవర్ చేసుకుబోయి బుక్ అయ్యారు అనే అభిప్రాయం వినిపిస్తోంది.