విశాఖ ఫార్మా పరిశ్రమలకు నిర్లక్ష్యపు రోగం ముదిరిపోయినట్లుగా కనిపిస్తోంది. అచ్యుతాపురం సెజ్ లో ఉన్న పరిశ్రమల్లో ఇటీవలి కాలంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో లెక్కే లేదు. ఎన్ని ప్రాణాలు బలవుతున్నాయో.. ఎన్ని కుటుంబాలు అనాథలవుతున్నాయో చెప్పడం కష్టం. భారీ ప్రమాదాలు అయితే బయటకు వస్తున్నాయి. చిన్న చిన్న ప్రమాదాలు అయితే లెక్కే లేదు.
ఫార్మా పరిశ్రమ అంటే.. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాంటి సిట్యూయేషన్ లోనూ ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు ఉండాలి. కానీ అచ్యుతాపురం సెజ్ లో బుధవారం జరిగిన ప్రమాదంలో ఫార్మా పరిశ్రమలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లుగా కనిపించలేదు.ఫలితంగా పది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరెంతో మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత వారికి నష్టపరిహారం ఇస్తే.. తప్పు దిద్దుకున్నట్లు కాదు. ప్రాణాలకు విలువను ఎవరూ కట్టలేరు.
ఫార్మా పరిశ్రమల్లో సరైన తనిఖీలు లేకపోవడం.. డబ్బులు మిగుల్చుకోవడం కోసం.. సరైన భద్రతా ఏర్పాట్లు చేపట్టకపోవడం.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న చోట్ల కూడా పొరపాట్లకు అవకాశం ఇవ్వడం ప్రమాదాలకు కారణంగా కనిపిస్తోంది. గత ఐదేళ్లలో కమిషన్లకు కక్కుర్తి పడిన అధికారులు ఫార్మా పరిశ్రమల్ని ఇష్టారీతిన నడిపించుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఫలితంగా ఇప్పుడు అత్యంత ఘోరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రభుత్వం తక్షణం.. అన్ని రకాల రసాయన పరిశ్రమల్లో సేఫ్టీ అడిట్ నిర్వహించి.. పరిశ్రమల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరికొన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది.