హారర్ కామెడీ జోనర్‌కు కాలం చెల్లిపోయిందనుకొంటున్న తరుణంలో అదే దెయ్యం కథతో సూపర్ హిట్టు కొట్టింది బాలీవుడ్. ‘స్త్రీ 2’ బాలీవుడ్ రికార్డుల్ని షేక్ చేస్తోంది. తొలి రోజే రికార్డు స్థాయిలో రూ.72 కోట్లు వసూలు చేసిన ఈ హారర్ కామెడీ, రూ.300 కోట్ల మైలు రాయిని చేరుకొంది. బాలీవుడ్ లో స్టార్లంతా బోత్తా పడుతున్న వేళ, రాజ్‌కుమార్ రావు… అక్కడ ఓ అద్భుతమే చేశాడు. బాలీవుడ్ బాక్సాఫీసుకు మళ్లీ జీవం పోశాడు.
‘కల్కి’ హిందీ రికార్డుల్ని… ‘స్త్రీ 2’ బద్దలు కొట్టడం బాలీవుడ్ వాళ్లకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పారితోషికాలన్నీ మినహాయిస్తే మేకింగ్ కోసం అటూ ఇటుగా రూ.30 కోట్లు అయ్యాయట. ఇప్పుడు వసూళ్లు చూస్తే అందుకు పది రెట్లు వచ్చేశాయి. ఈ ప్రభంజనం ఎక్కడ వరకూ వెళ్లి ఆగుతుందో చెప్పలేం. రాజ్ కుమార్ రావు ఏం సూపర్ స్టార్ కాదు. కంటెంట్ ని నమ్ముకొని సినిమాలు తీసే ఓ హీరో. అంతే. శ్రద్దాకపూర్ మినహాయిస్తే సినిమాలోనూ పెద్దగా స్టార్లు లేరు. దర్శకుడూ కొత్తే. కానీ ఈ సినిమా చూడాలన్న ఉత్సాహం తొలి రోజు నుంచే కనిపించింది. అందుకే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి.
ఓరకంగా బాలీవుడ్ స్టార్లకు ఇది మేల్కొలుపులాంటి సినిమా. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయాల్సిన పని లేదని, కంటెంట్ తో జనాల్ని థియేటర్ల వరకూ రప్పించగలమని ఈ సినిమా నిరూపించింది. హారర్ కామెడీ చిత్రాలకూ ఈ విజయం కొత్త ఊపు ఇచ్చినట్టే. ఓ హారర్ కామెడీ సినిమా మామూలు హిట్టయితేనే, దాన్ని ఫాలో అవుతూ పదుల సినిమాలు సెట్స్‌పైకి వెళ్లిపోతాయి. అలాంటిది రూ.300 కోట్లు తెచ్చిపెట్టిందంటే అది మామూలు విషయమా? కొన్నాళ్లుగా పక్కన పెట్టేసిన హారర్ కామెడీ సినిమాల స్క్రిప్టుల బూజు దులపాల్సిన సమయం ఇది.