హీరోని చూసి అందరూ ఫ్యాన్స్ అవుతుంటారు.
నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యా!
-‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఇవి. ఇంకొన్నాళ్లు ట్రోలర్స్ కీ, మీమర్స్‌కి ఈ మాటే.. ఆయుధంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. బన్నీ బాగా మాట్లాడగలడు. మాట్లాడతాడు కూడా. అయితే కొన్ని కొన్నిసార్లు బన్నీ స్పీచ్ ఓవర్ ది బోర్డ్ లా అనిపిస్తుంటుంది. ఆ కోవలో చెందే కామెంట్లు ఇవి.
హీరో అయ్యాకే ఫ్యాన్స్ పుట్టుకొస్తారు. ఫ్యాన్స్ పుట్టుకొచ్చాక హీరో అవ్వరు. ఇది చాలా చిన్న లాజిక్. కానీ బన్నీ ఈ లాజిక్ ని మర్చిపోయాడు. బన్నీ ఈ కామెంట్స్ చేయడం ఆలస్యం. ట్రోలర్స్, మీమర్స్ తగులుకున్నారు. ‘అంటే నువ్వు హీరో అవ్వకముందే నీకు ఫ్యాన్స్ ఉన్నారా’ అంటూ కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టారు. ఫ్యాన్స్ ని ఆర్మీ అంటూ పిలవడం బన్నీకి అలవాటు. అయితే అభిమానుల్ని సైన్యంతో పోల్చడం ఏమిటో చాలామందికి అర్థం కాదు. ఈసారి ‘నా ఆర్మీ’ అంటూ అభిమానుల్ని సంబోధించాడు.
ఈ సినిమాకు సుకుమార్ శ్రీమతి తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె కోసమే బన్నీ ఈ ఫంక్షన్‌కి వచ్చాడు. ఇదే మాట చెబుతూ ‘ఎక్కడికైనా నాకు నచ్చితేనే వెళ్తా. ఇష్టమైతేనే వస్తా’ అంటూ చెప్పడంలో కూడా కొంతమంది పరోక్ష అర్థాలు వెదుకుతున్నారు. గత ఎన్నికల్లో బన్నీ వైసీపీకి మద్దతుగా నంధ్యాల వెళ్లడం, అక్కడ ప్రచారం చేయడం విమర్శల పాలైంది. మెగా అభిమానులు బన్నీపై సోషల్ మీడియాలో గట్టిగానే ఎటాక్ చేశారు. ఇప్పుడు బన్నీ మాటలు వాటికి కౌంటర్ అనుకొనేలా ఉన్నాయి.
‘పుష్ష 2’ గురించి కూడా కొన్ని లీకులు ఇచ్చాడు బన్నీ. తన సినిమా గురించి తాను గొప్పగా చెప్పుకోనని, అయితే సినిమా వస్తున్న విధానం చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా ఏమాత్రం తగ్గేదేలే అనిపించేలా ఉంటుందన్న నమ్మకం కలుగుతుందని ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పాడు. తన సినిమా ఎలాగున్నా అభిమానులకు నచ్చేస్తుంది కాబట్టి, ‘పుష్ష 2’ కూడా వాళ్ల మనసుల్ని గెలుచుకొంటుదన్న ఆశాభావం వ్యక్తం చేశాడు బన్నీ. ఈమధ్య బన్నీకి, సుకుమార్‌కీ మధ్య గ్యాప్ వచ్చిందన్న మాటలు గట్టిగా వినిపించాయి. అయితే ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ వేదికపై బన్నీ, సుక్కు కెమిస్ట్రీ చూస్తే అదంతా ఊహాగానాలే అనిపించేలా ఉన్నాయి. మొత్తానికి బన్నీ స్పీచ్… మీమర్స్‌కి కావల్సినంత స్టఫ్ అయితే అందించింది.