సార్.. సార్.. మీ దండం పెడుతాను..మా అన్నయ్యను వెతికి పెట్టండి సార్..మొన్న రాఖీ కట్టించుకున్నాడు.. ఇంతలోనే కనిపించడం లేదంటూ అచ్యుతాపురం ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న బృందాలను ఓ యువతి బ్రతిమాలిన వైనం స్థానికుల హృదయాలను బరువెక్కించింది.
అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ధాటికి ఇప్పటివరకు 18మంది మృతి చెందారు. మరో అరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంటల్లో కాలిపోయి కొందరు, పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకొని మరికొంతమంది చనిపోయారు. మరికొంతమంది జాడ తెలియాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే గాజువాకకు చెందిన కిరణ్మయి అనే యువతి తన అన్నయ్య ఆచూకీ కోసం అధికారులను బ్రతిమాలిన తీరు హృదయాలను మెలితిప్పింది. రాఖీ పండుగ రోజున మా అన్నయ్య వెంకటసాయికి రాఖీ కట్టాను..మధ్యాహ్నం ఇక్కడ డ్యూటీకి వచ్చాడు..ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతోంది కానీ, లిఫ్ట్ చేయడం లేదు.. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను..మా అన్నయ్యను వెతికి పెట్టండి సార్.. అంటూ ఫోటోను చూపిస్తూ రోదించడం అక్కడున్న వారిని కలిచివేసింది.
వెంకటసాయి ఫార్మా కంపెనీలో రోజూ వారీలాగే బుధవారం విధులకు హాజరయ్యాడు. కంపెనీలో సాయంత్రం అనుకోని ప్రమాదం జరగడంతో వెంకట సాయి ఆచూకీ లభ్యం కావడం లేదు. అయితే, రియాక్టర్ పేలడంతో అక్కడ పని చేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల వరకు కార్మికులు ఎగిరిపడ్డారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉన్నారు. దీంతో వెంకట సాయి ప్రాణాలతో ఉన్నాడెమో వెతికిపెట్టండి సార్ అంటూ అతని సోదరి వేడుకోవడం చూపరులను కంటతడి పెట్టించింది.