అల్లు అర్జున్ ‘గడ్డం’ కూడా టాక్ ఆఫ్ ది టాలీవుడ్డే. ఆయన ‘పుష్ష 2’ షూటింగ్ మధ్యలో ఉండగానే గడ్డం ట్రిమ్ చేసేయ్యడం సినీ వర్గాల్ని, అభిమానుల్ని ఆశ్చర్యంలో పడేసింది. సడన్ గా ‘పుష్ష’ లుక్ లోంచి బయటకు రావడంతో కొత్త అనుమానాలు తలెత్తాయి. ‘షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. కాబట్టి… బన్నీ గడ్డం తీసేశారు. మళ్లీ షూటింగ్ మొదలయ్యేసరికి గడ్డం పెరిగిపోతుంది’ అంటూ… బన్నీ కాంపౌండ్ వర్గాలు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకొన్నాయి.
అయితే… నెల రోజుల గ్యాప్ కాస్త తగ్గిపోయి, అనుకొన్నదానికంటే ముందుగానే ‘పుష్ష 2’ షూటింగ్ మొదలైపోయింది. కావల్సినప్పుడల్లా పెరిగిపోవడానికి అది బీపీ కాదు కదా, గడ్డం. కాబట్టి.. తీసేసిన గెడ్డంతో కంటిన్యుటీ సమస్య వచ్చింది. సినిమా వాళ్లకు పెట్టుడు గడ్డాలు, మీసాలూ, విగ్గులూ అలవాటే. కాకపోతే… అవి ఎప్పుడూ ఆర్టిఫిషియల్ గానే ఉంటాయి. నేచురల్ లుక్ రావడానికి ‘పుష్ష’ టీమ్ చాలా కష్టపడిందట. ముంబై నుంచి ఓ నిపుణుడ్ని పిలిపించి, బన్నీకి పెట్టుడు గడ్డం సెట్ చేయించార్ట. దాని ఖరీదు అక్షరాలా రూ.40 లక్షలు అని తెలుస్తోంది. ఈ గెడ్డం టెంపరరీనే. మేకప్ తీసి, మళ్లీ వేసినప్పుడల్లా పెట్టుడు గడ్డంతో కవర్ చేయాలి. అందుకోసమే ఇంత ఖర్చని తెలుస్తోంది. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ వచ్చాడు. `పుష్ష` రేంజ్లో గడ్డం లేదు. ‘ఈ గడ్డంతోనే క్లైమాక్స్ షూట్ చేస్తున్నారా’ అంటూ అభిమానులూ ముక్కున వేలేసుకొన్నారు. దాని వెనుక కథ ఇది.
ఆగస్టు 15న రావాల్సిన సినిమా ఇది. అనుకొన్న సమయానికి పుష్ష వచ్చేస్తే… జాతకం ఈపాటికే తెలిసిపోయేది. కానీ ఇప్పుడు డిసెంబరు 6 వరకూ ఆగాలి. అప్పుడైనా ఈ సినిమా వస్తుందా, రాదా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ‘మారుతి నగర్’ ఫంక్షన్లో డిసెంబరు 6కే ఈ సినిమా వస్తుందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు.