కొంతకాలంగా బాక్సాఫీసు దగ్గర సరైన విజయాల్లేవు. ఆశలు, అంచనాలు మోసుకొంటూ వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఆగస్టు 15 రిలీజులతో అయినా బాక్సాఫీసుకు కాస్త హుషారు వస్తుందనుకొన్నారంతా. కానీ అది జరగలేదు. ‘ఆయ్’ మినహాయిస్తే ఏ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. ‘తంగలాన్’ బాగానే ఉన్నా, తెలుగులో వసూళ్లు లేవు. అంతకు ముందు వారం వచ్చిన ‘కమిటీ కుర్రాళ్లు’ కాస్త నిలబడింది. ఆ తరవాత ‘ఆయ్’. రెండూ చిన్న సినిమాలే.
ఈవారం మరో చిన్న సినిమా వస్తోంది. అదే.. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. రావు రమేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలపై పెద్దగా ఫోకస్ పడేది కాదు. సుకుమార్ భార్య ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించడం, ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్, సుకుమార్ అతిథులుగా రావడంతో అందరి ఫోకస్ ఈ సినిమాపై పడింది. దానికి తోడు… టీజర్, ట్రైలర్ బాగున్నాయి. రెండు పాటలు కూడా జనంలోకి వెళ్లాయి. దాంతో ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. రేపు ‘మారుతి నగర్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈరోజే.. ప్రీమియర్లు కూడా సెట్ చేశారు. ఓ చిన్న సినిమాకు ప్రీమియర్ లు వేయడం అరుదైన విషయమే. అందునా రావు రమేష్ హీరోగా నటించిన సినిమాకు. సుకుమార్ హ్యాండ్, బన్నీ చేసిన ప్రచారం ఈ సినిమాకు ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాలి.