మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు ఎప్పుడొస్తరు…? అసెంబ్లీకి రారు… ప్రజా సమస్యలపై నోరు తెరవరా? ప్రజల గోడు పట్టని నేతకు ప్రతిపక్ష నాయకత్వ పదవి ఎందుకు? ఇలా కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, కేసీఆర్ రైతు యాత్రకు రెడీ అవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలు నెరవేరటం లేదని… రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని కొంతకాలంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేటీఆర్, హరీష్ రావులు పోటీ పడి సవాళ్లు విసురుతూ యాత్రలు కూడా చేస్తున్నారు. అయినా ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.
ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేసీఆర్ బయట ఎక్కడా కనపడలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రం అసెంబ్లీకి వచ్చి, బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని మీడియా పాయింట్ లో చెప్పేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్కడా కనపడలేదు.
Also Read : రేవంత్ తో మోత్కుపల్లి… ఇక సైలెంట్ అయినట్లేనా?
అయితే, కేసీఆర్ ప్రజల్లోకి వస్తారా… రారా… అన్న ప్రశ్నకు తెరదించుతూ, కేసీఆర్ త్వరలోనే రైతు యాత్ర చేయబోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆలేరులో ప్రకటించారు. ప్రతి రైతుకు కాంగ్రెస్ ఇచ్చిన హమీలు నెరవేర్చే విధంగా ఒత్తిడి తెచ్చెలా యాత్ర చేయబోతున్నారన్నారు. తేదీలు మాత్రం ప్రకటించలేదు.
గతంలో కేసీఆర్ కు కాలికి గాయం అయిన తర్వాత కేసీఆర్ ఫిబ్రవరి నుండి తెలంగాణ భవన్ కు వస్తారని, కార్యకర్తలను కలుస్తారని, అందరితో మాట్లాడుతారంటూ హరీష్ రావు ప్రకటించారు. కానీ, అదేదీ జరగలేదు. మరి ఈ యాత్ర అనుకున్నట్లుగా జరుగుతుందో లేదో చూడాలి.