మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పై విచారణ చేయలని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సీఎస్ ను కలిసి ఫిర్యాదు చేశారు. చాలా మంది వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలపై విచారణకు వారి ప్రత్యర్థులు డిమాండ్లు చేస్తున్నారు. కానీ ఇక్కడ కూన రవికుమార్ మాత్రం… నకిలీ సర్టిఫికెట్ పై విచారణ కోరుతున్నారు. ఎందుకంటే తమ్మినేని సీతారం ఆ కేసులో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి.
తమ్మినేని సీతారాం డిగ్రీ పాస్ కాలేదు. కానీ ఆయన హైదరాబాద్ ఓ లా కాలేజీలో స్పీకర్ గా ఉన్నప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారు. ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి తమ్మినేని సీతారాం ఎలా అడ్మిషన్ తీసుకున్నారని.. ఆయన విద్యార్హతలు ఏమిటని తెలుసుకున్నారు. ఆయన నకిలీ డిగ్రీ పెట్టారని తేలింది. ఆయన చదివానని చెబుతున్న నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ దగ్గర్నుంచి యూనివర్శిటీ వరకూ అన్ని వివరాలు సేకరించి.. చివరికి ఆయన పెట్టింది… నకిలీ డిగ్రీ అని ఆధారాలను గతంలో టీడీపీ బయట ప ెట్టింది.
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అత్యంత తీవ్రమైన నేరం. సాధారణంగా ఇలాంటివి బయట పడితే వెంటనే ఆయన యూనివర్శిటీలు, కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి. టీడీపీ పూర్తి స్థాయి ఆధారాలతో తమ్మినేని నకిలీ డిగ్రీని బయట పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ ఎవరు తయారు చేశారు.. ఎందుకుతయారు చేశారు.. ఇలా ఎన్ని సర్టిఫికెట్లు తయారు చేశారన్నది తేలిస్తే.. చాలా పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో తాను డిగ్రీ చదలేదని చెప్పుకున్నారు. మరి ఆయన డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చింది.. దాన్ని పెట్టి లా కోర్సులో ఎలా చేరిపోయారు ?.