ఎన్నికల ఫలితాలతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. కూటమి సునామీలో చిత్తుచిత్తుగా ఓటమి పాలవ్వడంతో ఈ ఐదేళ్లలో వైసీపీ నిలిచి గెలవడం పెద్ద సవాలే. ఓ వైపు కూటమి పార్టీలు.. మరోవైపు పూర్వ వైభవం కోసం పాకులాడుతోన్న కాంగ్రెస్ ను ఎదుర్కొంటూ పార్టీని గాడిన పెట్టడం జగన్ కు అగ్నిపరీక్షే.
ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు జగన్ సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఓ వ్యూహకర్తను అపాయింట్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడంతో ఆయన మళ్లీ రాజకీయ వ్యూహకర్తగా సేవలు అందించబోనని ఇప్పటికే ప్రకటించారు. తమ వ్యూహాలతో మొన్నటి ఎన్నికల్లో ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన స్ట్రాటజీస్ట్ లలో.. సునీల్ కనుగోలు వైపు జగన్ మొగ్గు చూపినట్లుగా టాక్ నడుస్తోంది.
Also Read : కడపలో ఫ్యామిలీ పాలిటిక్స్… జగన్ కీలక నిర్ణయం!
తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో సునీల్ కనుగోలుది కీలక పాత్ర. ఇప్పుడు ఏపీలో వైసీపీది కూడా అదే పరిస్థితి. సొంతంగా పార్టీని జగన్ చక్కదిద్దలేని పరిస్థితి కనిపిస్తోంది. దాంతో సునీల్ కనుగోలుకు మంచి ఆఫర్ చేసి వైసీపీ వ్యూహకర్తగా నియమించుకోవాలని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, అందుకు సునీల్ కనుగోలు అంగీకరిస్తారా..? అనేది బిగ్ క్వశ్చన్.
ఇప్పటికే సునీల్ కనుగోలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సునీల్ టీం పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలందించింది. ఏఐసీసీ స్థాయిలో సునీల్ కనుగోలుకు ప్రాధాన్యం లభిస్తోంది. దాంతో ఆయన జగన్ ఆఫర్ చేసినా వైసీపీకి సేవలు అందించేందుకు నిరాకరించవచ్చునని తెలుస్తోంది.