తమిళ నటుడు ఎస్.జె.సూర్య తెలుగు వాళ్లకూ చిర పరిచయుడే. `ఖుషి`తో తనలోని దర్శకుడు వెలుగులోకి వచ్చాడు. ఆ తరవాత నటుడిగానూ మెప్పించాడు. `స్పైడర్` సినిమా ఫ్లాప్ అయినా, అందులో సూర్య విలనిజం బాగుంటుంది. `మానాడు`లో తన నటనకు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. ఇప్పుడు `సరిపోదా శనివారం`లోనూ తనే విలన్. ఈ సినిమాలో నాని – సూర్యల కెమిస్ట్రీ అదిరిపోతుందని, అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.
అయితే `సరిపోదా…` ప్రీ రిలీజ్ వేడుకలో సూర్య చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. తమిళ `బాషా` సినిమా ప్రభావం తెలుగు చిత్రసీమపై గట్టిగా ఉందని, తెలుగులో చాలా మంది హీరోలు `బాషా` కాన్సెప్టుతో సినిమాలు తీసి హిట్టు కొట్టారని, చిరంజీవి `ఇంద్ర`, ప్రభాస్ `బాహుబలి 2` బాషా తరహా కథలే అని, బాలకృష్ణ కూడా ఈ టైపు కాన్సెప్టుతో సినిమాలు తీశారని చెప్పుకొచ్చారు సూర్య. అంటే ఓరకంగా తెలుగు సినిమా యాక్షన్ కథలన్నీ `బాషా`కు కాపీలుగా ఆయన అభివర్ణించినట్టు లెక్క. సూర్య చెప్పిన మాటల్లో కాస్త నిజం లేకపోలేదు. `బాషా` స్క్రీన్ ప్లేని బేస్ చేసుకొని తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోలు ఈ స్క్రీన్ ప్లే ఫాలో అవుతూ సినిమాలు చేశారు. `సింహాద్రి` కూడా అలాంటి కథే అనుకోవాలి.
అయితే సూర్య తెలుసుకోని ఓ విషయం ఏమిటంటే ‘బాషా’ కూడా కాపీనే. అమితాబ్ నటించిన ‘హమ్’ ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయి. తమిళంలో కూడా ‘బాషా’ స్క్రీన్ ప్లేతో చాలా సినిమాలు పుట్టుకొచ్చాయి. ఓ చోట ఓ సినిమా బాగా ఆడిందంటే… దాని ప్రభావం మిగిలిన భాషల్లో గట్టిగా ఉంటుంది. ‘బాషా’ ప్రభావం ఇంకాస్త గట్టిగా ఉంది. అంతే తేడా.