తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై నియోజకవర్గ బహిష్కరణ వేటు వేసిన జిల్లా ఎస్పీ జగదీశ్..తాము అనుమతి ఇచ్చే వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని పెద్దారెడ్డి ఇంటికి నోటీసులు పంపారు.
పెదారెడ్డి వ్యాఖ్యలతో తాడిపత్రిలోరాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అధికారం కోల్పోయాక కూడా ఆయన రాజకీయం మారడం లేదు. ఇటీవల తాడిపత్రి వెళ్లి అక్కడి నుంచే రాజకీయాలు చేస్తానని పెద్దారెడ్డి వ్యాఖ్యానించడం టీడీపీ వర్గీయులను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆ పార్టీ అభ్యంతరం తెలిపింది.
మరోవైపు , రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పెద్దారెడ్డిని నియోజకవర్గం నుంచి బహిష్కరించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జేసీ కామెంట్స్ చేసిన వెంటనే పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం అగ్గిని రాజేసినట్లు అయింది. దీంతో పోలీసులు అప్పట్లో పెద్దారెడ్డిని అనంతపురానికి తీసుకెళ్ళారు.
తనను నియోజకవర్గానికి దూరంగా ఎందుకు ఉంచుతున్నారంటూ పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాడిపత్రి ఏమైనా జేసీ జాగీరా అంటూ అని ప్రశ్నించారు. తాడిపత్రికి వెళ్తా.. అక్కడి నుంచే రాజకీయాలు చేస్తానని సవాల్ చేశారు. ఇటీవల మళ్లీ ఆయన తాడిపత్రికి వెళ్ళిన సమయంలో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీంతో పెద్దారెడ్డి – జేసీ కుటుంబీకులు తాడిపత్రిలోనే ఉంటే ఘర్షణలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని .. పెద్దారెడ్డిని నియోజకవర్గం నుంచి బహిష్కరిస్తూ ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.