హైడ్రా దూకుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా చర్యలు చేపడుతుండటంతో హైడ్రా పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఫిర్యాదు అందగానే బుల్డోజర్లతో ప్రత్యక్షమై అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది.
శనివారం సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ కూల్చివేసిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఏంటనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిన హైడ్రా.. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.
కేటీఆర్ ది అని ప్రచారం జరుగుతోన్న జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చివేతకు ఉపక్రమించినా హైకోర్టు ఆదేశాలతో హైడ్రా ఆగిపోయింది. ఇక , బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా , మల్లారెడ్డిల విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టిందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే చెరువులను ఆక్రమించి బఫర్ జోన్ లో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నిర్మించారని విద్యాసంస్థలపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి నాదం చెరువు ఆక్రమించి అనురాగ్ విద్యాసంస్థలను నిర్మించారని కేసు నమోదు అయింది.
ఫిర్యాదు అందగానే ఇక హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అనురాగ్ విద్యాసంస్థలు అనే ప్రచారం జరిగింది. హైడ్రా దూకుడు మీద ఉండటంతో ఏ క్షణమైనా కూల్చివేతలకు దిగుతుందని అనుకున్నారేమో.. తన విద్యాసంస్థలకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ పల్లా హడావిడిగా ప్రకటన చేశారని అంటున్నారు. అయితే, డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం నిబంధనలకు విరుద్దంగా అనురాగ్ , మల్లారెడ్డి విద్యాసంస్థల నిర్మాణాలు ఉంటే హైడ్రా చర్యలకు దిగే అవకాశం ఉంది.