తెలంగాణ బీజేపీ రాజకీయాలు గతానికి భిన్నంగా తయారు అవుతున్నాయి. అసెంబ్లీ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలను సాధించి ఊపు మీదున్న బీజేపీ, ఆజోష్ ను కంటిన్యూ చేయలేకపోతోంది. ఎమ్మెల్యేలకు – రాష్ట్ర నాయకత్వానికి మధ్య గ్యాప్ క్రమంగా పెరిగిపోతుందన్న ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో మరో వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.
బీజేపీ కార్యాలయంలో నిర్వహించే ప్రెస్ మీట్లపై రాష్ట్ర నాయకత్వం ఆంక్షలు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీలు,ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీడియా సమావేశం ఏర్పాటు చేయాలంటే పార్టీ మీడియా ఇంచార్జ్ అనుమతి తీసుకోవాల్సిందేనని ఆదేశాలు ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. లేదంటే పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదు.
అసలెందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది..? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే , కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో బీజేపీ విమర్శలు ఎదుర్కొనేలా ఉందని, ఒక్కో నేత ఒక్కో మాట మాట్లాడుతుంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్న ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.
ఇటీవల మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేస్తే.. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మేఘా సంస్థ తప్పిదాలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలితే… మీడియాను తీసుకెళ్లి మరీ చూపించి, కాంట్రాక్టు సంస్థ తప్పిదాలను ఎత్తిచూపారు. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మేఘాకు అక్కడి ప్రభుత్వాలు పలు ప్రాజెక్టులు అప్పగించడంతో.. ముందుగా మేఘాపై బీజేపీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కమలనాథులు డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది.
హైడ్రా విషయంలోనూ అంతే. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైడ్రాను శభాష్ అంటూ కీర్తించగా, మరో ఎంపీ ఈటల మాత్రం ప్రతిరోజు విమర్శిస్తున్నారు. ఎంపీ రఘునందన్ రావు స్టైలే పూర్తిగా డిఫరెంట్. వీరి పరిస్థితి ఇలా ఉంటే కొందరు ఎమ్మెల్యేలు అసలు పార్టీ ఆఫీసు వైపే రారు. ఇలా చాలా అంశాల్లో ఎమ్మెల్యేలు-రాష్ట్ర నాయకత్వం చేస్తోన్న వాదనకు పొంతన ఉండటం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రెస్ మీట్లపై ఆంక్షలు విధించిందని చర్చ సాగుతోంది.
కానీ పార్టీ నేతలపైనే ఇలాంటి ఆంక్షలు పెట్టడం, పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే… బీజేపీ లో ప్రశ్నించే వారు ఎవరుంటారు? అన్న అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది.