తిరుమల శ్రీవారిని కూడా అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వారికి విజలెన్స్ షాకిచ్చింది. ఇంత కాలం విచారణలు జరిపి.. ఆధారాలు సేకరించి ఇప్పుడు.. నోటీసులు జారీ చేసింది. పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు బయటపడ్డాయని మీ పాత్ర స్పష్టంగా ఉందని వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికి మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలతో పాటు ఐదేళ్ల పాటు టీటీడీని గుప్పిట్లో పెట్టుకున్న ధర్మారెడ్డికి కూడా విజిలెన్స్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
టీటీడీలో ఐదేళ్ల పాటు కొంత మంది రెడ్డి వర్గానికి చెందిన నేతలు, అధికారులే చక్రం తిప్పారు. వేలకోట్ల శ్రీవారి నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు భూమన కరుణాకర్ రెడ్డికుమారుడు పోటీ చేయడానికి… తిరుపతిలో అభివృద్ధి పనులు చేపట్టారు., వాటికి టీటీడీ నిధులు కేటాయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల ఇంజినీరింగ్ పనులకు కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు.
ఇక శ్రీవాణి ట్రస్ట్ పేరుతో చేసిన దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ కూడా నగదు లావాదేవీలు ఎక్కువగా ఉండటం.. దర్శనాలకు ఆదాయానికి పొంతన లేకపోవడంపై విజిలెన్స్ విస్తృత విచారణ జరిపింది. అన్ని వ్యవహారాల్లోనూ కేసులు పెట్టి చర్యలు తీసుకునేందుకు ప్రాథమికంగా ఆయా నిందితులకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఐదేళ్ల పాటు టీటీడీలో జరిగిన దోపిడీ వ్యవహారాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.