కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా .. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన వయసు ముఫ్పై ఐదేళ్లే. ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. బీసీసీఐలోకి అలా వచ్చి అలా.. చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఐసీసీలోనే కుర్చీ వేసుసుకున్నారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్క్ లే మరోసారి కొనసాగే అవకాశం ఉన్నా.. ఆయన వద్దనుకున్నారు. దాంతో జై షాకు పీఠం వరించింది. డిసెంబర్ ఒకటిన ఆయన ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటారు.
ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఉన్నారు. బీసీసీఐలో అధ్యక్షుడి కంటే పవర్స్ ఎక్కువ. ఆయన రెండో సారి కార్యదర్శి పదవిలో ఉన్నారు. ఆయన ఐసీసీ చైర్మన్ గా వెళ్తే బీసీసీఐకి కొత్త కార్యదర్శి రావాల్సి ఉంటుంది. జై షా కనుసన్నల్లో పని చేసే వారే ఈ పదవిలోకి వస్తారు. రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ పేర్లు వినిపిస్తున్నాయి.
బీసీసీఐ అధ్యక్షుడిగా జై షా సూచించిన వ్యక్తులే ఎన్నికవుతూ వస్తున్నారు. మొదటి టర్మ్ లో సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఇప్పుు రోజర్ బిన్నీ ఉన్నారు. అయితే వారి పాత్ర పరిమితమే. అంతా జై షానే హైలెటయ్యేవారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. అందుకే.. భారత్ కు ఈ మధ్య తరచూ ఐసీసీ చైర్మన్ పోస్టులు లభిస్తున్నాయి.