వై నాట్ 175 పేరుతో ప్రారంభించి చివరికి 11కి పడిపోయిన వైసీపీ.. తాము ఎంత పాతాళానికి దిగిపోయామో.. ఎందుకంత లోతుకు ప్రజలు పడేశారో ఇంకా విశ్లేషించుకునే పరిస్థితుల్లో వైసీపీ లేదు. కనీసం బయటకు తెలియకుండా అయినా.. తెలుసుకుని.. బోర్లా పడిన పార్టీని పైకి లేపుకుని కాస్త నిటారుగా నిలబెట్టి ముందుకు సాగుదామని అనుకోవడం లేదు. తమ నేల బారు రాజకీయంతో .. ఇక ఈ పార్టీ మారదు అని ప్రజలు చీత్కరించుకునేలా చేసుకుంటోంది.
అసహ్యించుకునేలా సోషల్ మీడియా విభాగం తీరు
వైసీపీ సోషల్ మీడియా ఆ పార్టీ ఓటమిలో ప్రధాన పాత్ర. యువతలో బలమైన వ్యతిరేక ముద్ర పడేలా చేసింది. వైసీపీని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిపై బూతులతో దాడి చేయడం దగ్గర్నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా వదిలి పెట్టకుండా వేధింపులకు గురి చేయడంతో ఈ సైకోల బారిన మళ్లీ పడాలా అన్న ఆలోచనకు ప్రజలు వచ్చారు. ముఖ్యంగా యువత వచ్చింది. ఓడిపోయిన తర్వాత కనీసం రెక్టిపై చేసుకునే ప్రయత్నం చేయలేదు సరి కదా.. అంత కంటే నీచంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అన్న క్యాంటీన్ల మీద చేసే ప్రచారంతో ఎంత నెగెటివ్ అవుతుందో అర్తం చేసుకోవడం లేదు. కానీ అదే పని చేస్తోంది.
రోజు రోజుకు బయటపడుతున్న నేతల అసభ్య చేష్టలు
అధికారం ఉన్నప్పుడే చెలరేగిపోయారు. అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చెప్పలేము కానీ ఆ పార్టీలో అందరూ పెద్ద గ్రంధసాంగులేనని.. ప్రతి ఒక్కరి గుట్టు ఎవరో ఒకరి దగ్గర ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చివరికి సలహాదారుడు కూడా ఊ సూప్ లో ఇరుక్కున్నాడని చెబుతున్నారు. ఎప్పుడు ఏ వీడియో బయటకు వస్తుందోనన వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. అయితే ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని ప్రజల్లో ఇమేజ్ అయినా కాస్త పెంచుకుందామన్న ప్రయత్నాలు అసలు వైసీపీ హైకమాండ్ చేయడం లేదు. అలాంటి వారే తమ స్టార్ ప్లేయర్లన్నట్లుగా వ్యవహరిస్తోంది.
పార్టీ తరపున మాట్లాడేది.. అంబటి రాంబాబు, పేర్ని నానిలేనా !
పార్టీ వాదన ప్రజల్లోకి వెళ్లాలంటే.. వాటి గురించి చెప్పే నేతలకు ఓ మాదిరి ఇమేజ్ అయినా ఉండాలి. కానీ ప్రజల్లో దారుణమైన ఇమేజ్ ఉన్న పేర్ని నాని, అంబటి రాంబాబుల్ని మాట కంటే ముందు తెరపైకి వస్తారు. వారు మాట్లాడే మాటలతో అసలు విషయం పక్కకు పోతుంది. ఎలా చూసినా.. వైసీపీ నేల బారు రాజకీయాన్ని దాటి కాస్త పైకి లేచి రాజకీయం చేద్దామన్న ఆలోచన చేయడం లేదు.