అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రా దూకుడు కంటిన్యూ అవుతోంది. ఎవరేం అనుకున్నా, రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా… హైడ్రా తీసుకున్న తాజా నిర్ణయం హర్షించేదే.
అవును… హైడ్రా పరిధిలో చాలా కాలేజీలు, విద్యాసంస్థలు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. మల్లారెడ్డి కాలేజీలతో పాటు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఓవైసీ బ్రదర్స్ విద్యాసంస్థలు… ఇలా ఎన్నో ఉన్నాయి. ఫోకస్ అయినవి మాత్రం ఈ ముగ్గురివే. ముందుగా ఓవైసీ బ్రదర్స్ ది కూల్చుతారా? రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేస్తారా? అన్న చర్చ సాగింది. మల్లారెడ్డి ఆక్రమణల ఆరోపణలపై హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేసింది.
అయితే, విద్యా సంవత్సరం మధ్యలో భవనాలు కూల్చితే… విద్యార్థులకు తీవ్ర నష్టం అని, అందుకే విద్యా సంస్థల కూల్చివేతపై వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ముందుగా నోటీసులు ఇస్తాం, సదరు సంస్థే ఆ బిల్డింగ్ నుండి విద్యార్థులను మరో చోట ప్రత్యామ్నాయ మార్గం చూపించి, బిల్డింగ్ ను కూల్చివేయాల్సి ఉంటుందని హైడ్రా రంగనాథ్ ప్రకటించారు.
అంతేకాదు సామాన్య ప్రజలు, పేదలు కట్టుకున్న ఇండ్ల జోలికి వెళ్లబోమని… తమ లక్ష్యం చెరువులను ఆక్రమణ నుండి కాపాడుకోవటమేనని రంగనాథ్ ప్రకటించటం మరో విశేషం.
ఓవైసీ బ్రదర్స్ విద్యా సంస్థల భవనం కూల్చివేతపై ఎన్నో ఒత్తిడులు రావటంతో హైడ్రా ఏం చేస్తుందో అన్న ఆసక్తి నెలకొన్నా, హైడ్రా తీసుకున్న నిర్ణయం కూడా సబబే అన్న సానుకూలత వ్యక్తమవుతోంది.