గత కొద్ది రోజులుగా వివిధ రాజకీయ అంశాల చుట్టూ తిరిగిన తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ అయ్యాయి. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడంతో ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్నీ ఈ అంశం ఆధారంగా విమర్శలు, ప్రతివిమర్శలు ప్రారంభించాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ దక్కడం బీఆర్ఎస్ – బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు కవితకు బెయిల్ కాంగ్రెస్ కృషి అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు..ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – బీఆర్ఎస్ మధ్య అంతరంగిక ఒప్పందం కుదిరిందంటూ లిక్కర్ స్కామ్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయిన కాంగ్రెస్.. ఇప్పుడు కవిత బెయిల్ కు బీజేపీ సహకారం అందించిందని దీనిని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా వాడుకోవాలనుకుంటోంది.
అదే సమయంలో గత కొన్నాళ్ళుగా మీడియాకు , ప్రజలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. ఇక గ్రౌండ్ లోకి దిగుతారని అంటున్నారు. బీఆర్ఎస్ పై జరుగుతోన్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు కవితకు బెయిల్ దక్కిన తర్వాత రంగంలోకి దిగాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కొద్ది రోజుల్లోనే మీడియా ముందుకు వస్తారని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ – బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని ఆయన తన వర్షన్ వినిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇక, ఈ విషయంలో కాంగ్రెస్ రాజకీయాన్ని అంచనా వేసిన బండి సంజయ్.. ఇది కాంగ్రెస్ చేసిన కృషి అంటూ ఎదురుదాడి మొదలు పెట్టారు. కవిత తరఫున కింది కోర్టులో ఏఐసీసీ నేత అభిషేక్ మను సింఘ్వి వాదించారన్నారు. బండి తప్పితే ఏ నేత కూడా కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారు. దీంతో కవిత బెయిల్ అంశం బీజేపీని మళ్లీ డిఫెన్స్ లో పడేసినట్లుగా కనిపిస్తోంది.