వైసీపీ పాలనలో పోలీసులు ముంబై నటి కుటుంబాన్ని వేధించిన వైనం సంచలనంగా మారింది. తప్పు చేయకపోయినా విజయవాడ పోలీసులు తప్పుడు కేసు పెట్టించి విమానాల్లో వెళ్లి మరీ ఆ కుటుంబాన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చి సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు ఆ కేసు పై పోలీసులు దృష్టిపెట్టారు. కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్ కు.. ఆ నటికి సంబంధం ఉందా… ఎక్కడైనా పరిచయమా లేదా అన్నది ఆరా తీశారు. అసలు ఎక్కడా పెద్దగా పరిచయం లేదని.. నగదు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా ఆధారాల్లేకపోయినా కేసులు పెట్టారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇంటలిజెన్స్ అధికారులు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వివరాలు సీఎంవో అధికారులకు అందించారు. సీఎంవో ఈ కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉంది. వ్యవస్థల్ని ఇలా మాఫియా స్టైల్లో వాడుకున్న వైనంపై కఠిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు వారు చెలరేగిపోతారని.. ఆ ఐపీఎస్‌లపై వేటు పడేలా చేయకపోతే… మరికొందరికి ధైర్యం వస్తుందన్న వాదన వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఆ కేసు లోతుపాతుల్ని బయటకు తీసి.. ఆయా పోలీసులకు షోకాజ్ నోటీసులని జారీ చేయబోతున్నారు.
తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నటి కాదంబరి జెత్వానీ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక సంచలనమే అవుతుంది. అయితే ఆమె భయపడుతున్నారని.. పోలీసులు భరోసా ఇప్పిస్తే ఆమె బయటకు వచ్చి జరిగిందంతా చెబుతారని అంటున్నారు. ఆమెకు జరిగిన అన్యాయం.. చేసిన వైనం చూస్తే.. ఆ ఐపీఎస్ అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించడానికి అవసరమైన సరంజామా దొరికినట్లేనని భావిస్తున్నారు.
ఈ కేసు విషయంలో ముందు ముందు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.