ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించాలని కేబినెట్ నిర్ణయించడంతో 21.86లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉండబోతుంది.
22ఏ , ఫ్రీ హోల్డ్ భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అలాగే, వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఇక, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వైసీపీ హయాంలో తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్దరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం పనులు చేస్తోన్న గుత్తేదారు సంస్థనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే, అబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ రద్దు చేయాలని కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.