టాలీవుడ్ లోనూ జేమ్స్ బాండ్ కథల్ని స్టైలీష్‌గా, రిచ్‌గా తీయొచ్చు అని నిరూపించిన సినిమా ‘గూఢచారి’. అడవిశేష్ని మిగిలిన హీరోల్లో ప్రత్యేకంగా నిలబెట్టిన సినిమా ఇది. శేష్ మార్కెట్ ఈ సినిమాతో విస్త్రతమైంది. ఇప్పుడు ‘గూఢచారి 2’ వస్తోంది. పెరిగిన అంచనాల్ని. ప్రేక్షకుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ సినిమా కథ, కథనాలు, బడ్జెట్ పై చిత్రబృందం ప్రత్యేక దృష్టి నిలిపింది. ఈ సీక్వెల్ కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాస్టింగ్ పరంగానూ టీమ్ జాగ్రత్తలు తీసుకొంటోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంచుకొన్నారు. ఇమ్మాన్ ఇమేజ్, మార్కెట్ ‘గూఢచారి 2’కి కలిసొస్తుందని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది. 2025 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ‘గూఢచారి 1’కి ఎడిటర్ గా పని చేసిన వినయ్ కుమార్ ఈ సీక్వెల్‌కి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఎడిటర్లు దర్శకులుగా మారడం చాలా అరుదైన విషయం. పైగా రూ.100 కోట్ల సినిమాతో దర్శకుడిగా లాంచ్ అవ్వడం గొప్ప సంగతే.
అడవిశేష్ తన కెరీర్ ప్రారంభించినప్పుడు తన మార్కెట్ రెండు మూడు కోట్ల లోపే. సినిమా తరవాత మరో సినిమా అంటూ హిట్టు కొడుతూ, బడ్జెట్ పెంచుకొంటూ, తన మార్కెట్ మరింత విస్కృత పరచుకొంటున్నాడు. ‘మేజర్’తో పాన్ ఇండియా హిట్టు కొట్టి, ఇప్పుడు ‘గూఢచారి 2’తో వంద కోట్ల సినిమా అందించే స్థాయికి ఎదిగాడు. దీంతో పాటు శేష్ ‘డెకాయిట్’ అనే మరో సినిమా ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిక.