ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారశైలి కూటమి ప్రభుత్వాన్నికి తలవంపులు తెచ్చేలా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ కేబినెట్ భేటీ సందర్భంగా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది ఎమ్మెల్యేలు అధికారదర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు సేవకులం అన్న సంగతిని మరిచి..ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల వైఖరి ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని, ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకునేలా మంత్రులు వారిని గైడ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ప్రభుత్వం పట్ల ప్రజలకు కలుగుతోన్న విశ్వాసం కేవలం ఇద్దరు, ముగ్గురూ ఎమ్మెల్యేల వ్యవహారశైలితో దెబ్బతింటోందని వివరించారు. కొంతమంది ప్రవర్తన అందరికీ చెడ్డపేరు తీసుకొస్తుందన్నారు.
ఇటీవల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు ఇసుక ట్రాక్టర్ కు 500చొప్పున వసూళ్లు చేస్తున్నారని వార్తను ప్రచురించిన జర్నలిస్టులకు ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించడం వివాదాస్పదం అయింది. తాజాగా.. గుంటూర్ వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రారావు ఓ వ్యక్తిని బెదిరించడం కూడా వివాదాస్పదం అవుతోంది.
వరుసగా ఈ సంఘటనలు చేసుకోవడంతో మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు. హద్దులు మీరి ప్రవర్తిస్తోన్న ఎమ్మెల్యేలను సరైన పద్ధతిలో నడిపించేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.