రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. అప్పటి వరకు సాఫీగా సాగుతోన్న రాజకీయం.. ఒక్క వ్యవహారం, ఒక్క మాట పార్టీని అధఃపాతాళానికి చేరువ చేస్తుంది. ఇప్పుడు వైసీపీ అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది.
అధికారం కోల్పోయాక విపక్షం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం సహజమే. తాజా పరిస్థితులను చూస్తుంటే వైసీపీ గొప్పలకు పొయి తొందరగా గోతిలో పడినట్లుగా కనిపిస్తోంది. తాము విపక్షంలో ఉన్నా.. రాజ్యసభలో , లోక్ సభలో ఉన్న బలం దృష్ట్యా టీడీపీ కన్నా తక్కువేమి కాదని గొప్పగా వైసీపీ నేతలు చెప్పుకున్నారు. కానీ, వైసీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యుల్లో మెజార్టీ నేతలు వైసీపీని వీడెందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు వైసీపీని వీడెందుకు రంగం సిద్దం చేసుకోగా .. మరికొంతమంది కూడా అదే బాటలో ఉన్నారు. వైసీపీకి ఉన్న బలంతో మండలిలో సర్కార్ ను ఇరుకున పెట్టాలని ప్లాన్ వేసినా ఎమ్మెల్సీలు ఎప్పుడు జారుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే , పార్లమెంట్ లో తమకు టీడీపీ కన్నా ఎక్కువ బలం ఉందంటూ వ్యాఖ్యానించిన వైసీపీకి.. ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.
దీంతో రాజ్యసభలో తమకున్న బలం ద్వారా బీజేపీ నుంచి ప్రాధాన్యత లభిస్తుందని ఆశించి గొప్పలు పోయిన వైసీపీకి తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి. పెద్దల సభ ద్వారా అన్ని విధాలా గట్టెక్కాలనుకున్న జగన్ ప్లాన్ వికటిస్తున్నట్లు కనిపిస్తోంది.