ఎన్డీఏలో టీడీపీ అత్యంత కీలక భాగస్వామి. బీజేపీ అధికారం స్థిరంగా ఉండాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరే. అయితే, టీడీపీకి రాజ్యసభలో అసలేం బలం లేకపోవటం మైనస్. అక్కడ కూడా టీడీపీకి ఎంపీలు ఉంటే… రాజ్యసభలో బలం లేదని బీజేపీ, టీడీపీపై ఇంకా ఆధారపడాల్సి వస్తుంది.
కానీ, ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయినా, లోక్ సభలో ఎంపీలు తగ్గిపోయినా… రాజ్యసభ ఎంపీలున్నారు, బీజేపీకి మన అవసరం కూడా ఉందిగా అని ఇన్నాళ్లు నిర్భయంగా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆ ఎంపీలు కూడా ఝలక్ ఇస్తున్నారు.
అవును… ఇప్పుడు వైసీపీ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడనున్నారు. వారు పార్టీ మారితే రాజీనామా చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాజీనామా చేస్తున్న ఎంపీలంతా టీడీపీ గూటికి వచ్చే అవకాశం ఉండటంతో… ఉప ఎన్నికలు వచ్చినా ఆ స్థానాలు టీడీపీకే దక్కుతాయి. ఆ లెక్కన టీడీపీ బలం ఎన్డీఏ కూటమిలో మరింత పెరుగుతుందన్న మాట.
ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న మోపిదేవితో పాటు బీద మస్తాన్ రావు కూడా పార్టీకి రాజీనామా చేయటం దాదాపు ఖాయమైపోయింది. వీరి బాటలోనే మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, పార్టీ మారినా… మీరంతా బీజేపీకి వెళ్లండి, పార్టీ ఎల్పీ విలీనం అయినా పర్వాలేదు కానీ టీడీపీ గూటికి వద్దు అని జగన్ రాయబారం పంపుతున్నట్లు వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.