తెలంగాణ తల వంచదు అని కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు సీబీఐ నోటీసులు జారీ చేసినప్పుడు స్పందించారు. అప్పుడే అసలు కవిత ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం ఎందుకు చేయాలి.. అక్కడేదో కేసు అయితే ఇక్కడ తెలంగాణ మొత్తానికి ఎందుకు అంటించాలి అన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత ఎయిర్ పోర్టు దగ్గర జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇప్పుడు అంత కంటే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి.
తప్పు చేస్తే బిడ్డనైనా జైలుకు పంపుతానని కేసీఆర్…తెలంగాణ తొలి అసెంబ్లీలో భీకరమైన ప్రకటన చేశారు. ఆయన పంపలేదు కానీ… సీబీఐ, ఈడీ పంపాయి. అది తప్పుడు కేసు అని వాదిస్తున్నారు కానీ.. ఆమె లావాదేవీలు.. సౌత్ లాబీ సహా మొత్తం బయటకు వచ్చాయి. ప్రజలకు ఓ క్లారిటీ ఉంది. ఇక్కడ తెలంగాణ కు సంబంధం లేదు. అరెస్టు వెనుక రాజకీయం ఉందా లేదా అన్న సంగతి తర్వాత…. ఇక్కడ పదే పదే తెలంగాణను అడ్డం పెట్టుకుని కేసు నుంచి రక్షణ పొందాలని ఎందుకు అనుకుంటున్నారు ?
కవిత తన వ్యక్తిగత కేసును వ్యక్తిగతంగానే తీసుకోవాలి. ప్రతీ దానికి … చివరికి ఇలాంటి లిక్కర్ కేసుల్లోనూ తెలంగాణ వాదం తీసుకు వస్తే అది తెలంగాణను అవమానించడమే అవుతుంది. కవిత తెలంగాణ కోసం పోరాడి ఉండవచ్చు.. ఆ పోరాటంలో ఆమెపై కేసులు పెడితే… జై తెలంగాణ నినాదాలు చేస్తే ఓ అర్థం ఉంటుంది. తన లిక్కర్ కేసుకు…తన తెలంగాణ ఉద్యమానికి లింక్ ఉందన్నట్లుగా వ్యవహరించడమే పెద్ద మైనస్. ప్రజల్లోనూ ఇక వీరు మారరు అన్న భావన రావడానికి కారణం అవుతోంది.