నామినేటెడ్ పోస్టులపై ఏపీ కూటమిలో పంచాయతీ తేలడం లేదు. పురందేశ్వరితో కలిసి బీజేపీ ముఖ్య నేతలు చంద్రబాబును కలిశారు. తమకు కావాల్సిన పోస్టులు.. ఎవరెవరికి ఇవ్వాలో జాబితా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలకు అవకాశాలు కల్పించాలని కోరినట్లుగా తెలుస్తోంది. వీరి విషయంలో టీడీపీ హైకమాండ్ ఏ మాత్రం సానుకూలంగా ఉండే అవకాశం లేదు.
అయితే అసెంబ్లీ , ఎంపీ టిక్కెట్ల విషయంలో ప్రో వైసీపీ నేతలకు అవకాశాలు ఇవ్వలేదు. దాంతో వారు సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో అంటకాగి… ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారు… టీడీపీ అంటే ద్వేషం చూపించేవారిని పక్కన పెట్టి పదవుల ప్రతిపాదనలు తీసుకు రావాలన్న అభిప్రాయం కూటమిలో వినిపిస్తోంది. తీరా పదవులు ఇచ్చాక వారు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తే ఇబ్బంది పడతామని అనుకుంటున్నారు.
మరో వైపు జనసేన పార్టీ నుంచి కూడా పదవుల ఒత్తిడి ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ఆ పార్టీకి చెందిన కొంత మంది నేతలు.. కూటమి కోసం పని చేయకపోయినా ఇప్పుడు పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇక టీడీపీలో త్యాగరాజులంతా తమను గుర్తించాలని వెంట పడుతున్నారు.