111 జీవో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ఇదో పెద్ద విషయం. ఓ వైపు పూర్తిగా పచ్చదనం, ఫామ్ హౌస్‌లతో నిండిపోవడానికి .. పెద్దగా నిర్మాణాలు ఉండకపోవడానికి ఈ జీవోనే కారణం. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఈ జీవోను ఎత్తేస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ అధికారిక ప్రక్రియ పూర్తయిందా లేదా అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుత ప్రభుత్వం 111 జీవో ఉనికిలో ఉందన్నట్లుగా వ్యవహరిస్తోంది. అంటే… 111 జీవో రద్దు కాలేదని భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీగానే పనులు చేస్తోంది. కానీ … అధికారికంగా ఒక్క ప్రకటన జారీ చేసి… 111 జీవో ఉందని చెబితే.. చాలా మందికి క్లారిటీ వచ్చేస్తుంది.
జీవో 111 కిందికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 84 గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు చెరువులు ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటి అవసరాలు కీలకం. అందుకే వాటిలోకి నీరు చేరే క్యాచ్ మెంట్ ఏరియాలో నిర్మాణాలు ఉండకూడదని.. జీవో 111 తీసుకు వచ్చి బయో కన్జర్వేషన్ జోన్‌గా మార్చారు. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. 1 లక్షా 32 వేల ఎకరాల భూములు ఉంటాయి. నగరానికి చేరువలో ఇంత భూముల్లో కేవలం పది శాతంలో మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ రెండు చెరువుల నీటిని వాడటం లేదు కాబట్టి.. ఆ జీవో ఎత్తేసి.. అటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సహకరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. జీవో ఎత్తేశారు. కానీ ఉనికిలోకి రాలేదు.
ఇప్పుడు హైడ్రా ఆ జీవో 111 ప్రకారమే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 111 జీవో వల్ల 84 గ్రామాలు బఫర్ జోన్లోకి వెళ్లినట్లే. అందుకే అక్కడి ప్రజలు 111 జీవోపై స్పష్టత కోరుతున్నారు. నిజానికి కేసీఆర్ జీవో ఎత్తేసినట్లుగా ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. బడా బాబులు నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ల సంగతి పక్కన పెడితే.. ప్లాట్లుగా మారిపోయిన పొలాల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అనుమతుల్లేకుండా… పంచాయతీల్లో అపార్టుమెంట్లు కట్టేస్తున్నారు. వీటికి కూల్చి వేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
అందుకే ప్రభుత్వం ఉన్న పళంగా వివరణ ఇచ్చి … చట్ట విరుద్ధంగా సాగే నిర్మాణాలను ఆపేయడం వల్ల చాలా మంది అలాంటి వాటిని కొనేందుకు వెనుకాడతారు. ఫలితంగా నష్టపోకుండా ఉంటారు. ప్రభుత్వానికి కూడా కూల్చివేతల భారం తగ్గుతుందన్న వాదన వినిపిస్తోంది.