హైడ్రా దూకుడు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నా కుటుంబ సభ్యులవి కూడా అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మరుసటి రోజే ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి హైడ్రా నోటీసులు ఇచ్చింది.
మదాపూర్ లోని అమర్ కో- ఆపరేటివ్ సొసైటీలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన ఉంటోన్న ఈ నివాసం దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన హైడ్రా అధికారులు.. ఇంటికి నోటీసులు అంటించారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
రైతు రుణమాఫీపై ప్రభుత్వం అసమర్ధతను పక్కదోవ పట్టించేందుకు హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హైడ్రా పేరుతో బెదిరిస్తూ పార్టీలోకి లాక్కోవాలని చూస్తోందని గులాబీ నేతలు గుస్సా అవుతున్నారు. దమ్ముంటే హైడ్రా కాంగ్రెస్ నేతలకు, రేవంత్ రెడ్డి సోదరులకు నోటీసులు ఇచ్చి నిబంధనలకు విరుద్దంగా ఉన్న భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఎఫ్ టీఎల్ పరిధిలో ఉందని , ఆ భవనాన్ని నెల రోజుల్లోపు కూల్చివేయలంటూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. తాజా పరిణామంతో హైడ్రా పనితీరు, దూకుడుపై మరింత విశ్వసనీయత వ్యక్తం అవుతోంది.