బాలీవుడ్ నటి కాదంబరీ జిత్వాని కేసు వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.
ఆన్ లైన్ లో జిత్వాని నుంచి ఫిర్యాదు తీసుకోవాలన్న సీఎంవో.. క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఐపీఎస్ ల ప్రమేయం ఉందని ఆరోపణలతో సర్కార్ సీరియస్ అయింది. ఖాకీలు అన్న సంగతి మరిచి వైసీపీ నేతల డైరక్షన్ లో బాధితులపైనే కేసులు నమోదు చేయడం ,వేధించారనే ఆరోపణలపై త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించింది.
ఈ క్రమంలోనే తవ్విన కొద్ది పలు విషయాలు బయటకు వస్తుండటంతో ..ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వైసీపీలో టెన్షన్ నెలకొంది. మరోవైపు..బాధితురాలు కూడా తనకు , తన కుటుంబానికి రక్షణ కల్పిస్తే తనను వేధించిన వారిపై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేయడంతో.. వెంటనే జిత్వాని నుంచి ఆన్ లైన్ ఫిర్యాదు తీసుకొని విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే జిత్వానికి ప్రభుత్వం భద్రత కల్పించనుంది.
దీంతో ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలతోపాటు , సీనియర్ ఐపీఎస్ అధికారులకు కొద్ది రోజుల్లోనే నోటీసులు అందనున్నాయి.