పొరిబర్తన్ (పరివర్తన) అనే నినాదంతో 2011లో మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. 34 ఏళ్ల కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టారు. 2007 తర్వాత తొలిసారిగా ఎర్రజెండాకు బదులు బెంగాల్లో మరో పార్టీ జెండా రెపరెపలాడింది. సింగూర్, నందిగ్రాం, తదితర వివాదాలతో పాటు మరికొన్ని అంశాలు తృణమూల్ కాంగ్రెస్ కు కలిసివచ్చాయి. ప్రజలు కోటి ఆశలతో దీదీకి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా తేడా ఏమీ లేదనే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
బెంగాల్లో రాజకీయ రౌడీయిజం మన ఊహకు కూడా అందదు. హైదరాబాదులో గానీ, రాష్ట్రంలో మరో చోట గానీ అలాంటి వసూళ్లు కనీ వినీ ఎరుగం. వామపక్షాల హయాంలో సీపీఎం కార్యకర్తలు పార్టీ ఫండ్ పేరుతో భారీగా వసూళ్లు చేసే వారని ఆరో్పణలు వచ్చేవి. ఇప్పుడు మమత పాలనలో అదే వ్యక్తులు తృణమూల్ కాంగ్రెస్ పేరుతో కలెక్షన్లు చేస్తున్నారట. గత కొంత కాలంగా పలు పత్రికల్లో, ముఖ్యంగా టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి అగ్రశ్రేణి దినపత్రికల్లో వస్తున్న కథనాలు, వ్యాసాలను గమనిస్తే అధికార పార్టీ మారింది గానీ రాష్ట్రంలో పరిస్థితులు మారలేదని స్పష్టమవుతుంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఇళ్ల కొనుగోలుదారుల వరకూ అందరి నుంచీ పార్టీ ఫండ్ వసూలు చేయడం ఒకప్పుడు సీపీఎం పేరు మీద జరిగేదట. మరి ఆ పార్టీ నాయకులకు ఆ సంగతి తెలుసో లేదో వేరే విషయం. ఇప్పుడు అదే వ్యక్తులు, వాళ్లతో పాటు కొత్త వ్యక్తులు అదే పని చేస్తున్నారట. అయితే ఎర్ర జెండాకు బదులు తృణమూల్ జెండా నీడన దందాలు చేస్తున్నారట. ఇటీవల ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కోల్ కతాలో రూ. 50 లక్షల విలువైన ఫ్లాటును లోన్ తీసుకుని కొనుక్కున్నాడట. రిజిస్ట్రేషన్ జరిగిన నాలుగు రోజులకు తృణమూల్ కార్యకర్తల పేరుతో కొందరు రౌడీలు అతడి ఫ్లాటుకు వెళ్లారట. రూ. 50 వేలు పార్టీ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఎందుకని అడిగితే పార్టీ ఫండ్ ఇవ్వాల్సిందే అన్నారట. 1 శాతం కట్టడం ఇక్కడ ఆనవాయితీ అని గదమాయించారు. నువ్వు రోడ్లు వాడతావు కదా, ఇది రోడ్ ట్యాక్స్ అనుకో అని సలహా ఇచ్చారు. చివరకు ఆ అమాయకుడు రూ. 5 వేలు ఇచ్చి దండం పెట్టాడట. పోనీలే అని 5 వేలు తీసుకుని సదరు రౌడీలు వెళ్లిపోయారట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందీ కథనం.
2011కు ముందుకూడా ఇదే పరిస్థితి. కాకపోతే అప్పుడు ఎర్ర జెండా నీడన, సీపీఎం పేరుతో చందాల దందాలు జరిగేవని అదే పత్రిక కథనం పేర్కొంది. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని, పరివర్తన తీసుకు వస్తానని హామీ ఇచ్చిన మమతా బెనర్జీ ఈ విషయంలో సఫలం కాలేకపోయారనే ఎక్కువ కథనాలు వస్తున్నాయి. దౌర్జన్యాలు చేసే వారి పార్టీ పేరు మారింది అదే పరివర్తన్ అని కొన్ని పత్రికలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ బెంగాల్లో అదే చీకటి, అదే భయం అని టైమ్స్ కథనం వివరించింది. ప్రజాస్వామ్యమే అయినా, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు వెళ్లడం అనేది బెంగాల్లో ఆనవాయితీగా మారింది. మరి ఈసారి ఎన్నికల్లో ప్రజలు మరోసారి దీదీకే పట్టం కడతారో, సీపీఎంకు ఓటేస్తారో లేక మరో పార్టీని ఆదరిస్తారో చూడాలి.