శ్రీవిష్ణు నుంచి వస్తున్న మరో సినిమా ‘స్వాగ్’. ఈ సినిమా టైటిలే కాదు. ఇందులో శ్రీవిష్ణు పోషిస్తున్న పాత్రలు, వాటి పేర్లు అన్నీ చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు టీజర్ బయటకు వచ్చింది. ఇది కూడా చిత్రంగానే తోస్తోంది. కాలమాన పరిస్థితులు టీజర్లో పెద్దగా అర్థం కావడం లేదు కానీ మాతృస్వామ్య వ్యవస్థ, పితృ స్వామ్య వ్యవస్థ రెండింటినీ చూపించి, ఆగ – మగ వైరాన్ని ఫన్ జోనర్లో చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తోంది. శ్రీవిష్ణు గెటప్, హావభావాలూ, ఆ భాష కాస్త షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు హసిత్ గోలీ. ఓ కొత్త రకమైన కామెడీని ఈ సినిమా కోసం సృష్టించాడన్న ఆసక్తి టీజర్ చూస్తే కలిగింది.
వింజామర వంశ సామ్రాజ్యాన్ని చూపిస్తూ టీజర్ ఓపెన్ చేశారు. అక్కడ రీతూ వర్మ మగాళ్లని బాసిసలుగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తున్న విజువల్స్, డైలాగ్స్ తో చాలా ఆసక్తిగా టీజర్ మొదలైంది. ఈ సినిమా కోసం దర్శకుడు ఓ ఊహాజనితమైన కాలాన్ని, పాత్రల్ని పరిచయం చేసినట్టు అనిపించింది. డైలాగ్స్ ట్రెండీగా, ఫన్నీగా ఉన్నాయి. ఇందులో శ్రీవిష్ణు సింగ, భవభూతి, యయతి, కింగ్ భవభూతి పాత్రల్లో కనిపిస్తున్నాడు. యయతి పాత్ర పాత సినిమాల్లో రాక్ స్టార్‌ని పోలి ఉంది. భవభూతి మేకప్ భీకరంగా కనిపిస్తోంది. ‘ఆడవాళ్లంటే ఆడవాళ్లు’, ‘హాయ్ సాగర్ వాటే సడన్ సప్పయ్’ లాంటి సోషల్ మీడియా మీమ్స్ లో వాడే డైలాగులు ఈ టీజర్లో వినిపించాయి. శ్రీవిష్ఱు – హసిత్ గోలీనుంచి ‘రాజ రాజ చోర’ వచ్చింది. అది మంచి విజయాన్ని అందుకొంది. అందుకే ఈ కాంబోపై ఆశలు రెట్టింపు అయ్యాయి. ఈసారి ఈ జోడీ ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి.