వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు వెళ్లిపోతున్నారు. రాజ్యసభ ఎంపీల్లో ఒకరిద్దరు మిగిలితే చాలనుకుంటున్నారు. ఇక ఎమ్మెల్సీల సంగతి చెప్పాల్సిన పనిలేదు. పార్టీలో ఇంత జరుగుతూంటే.. చాలా మంది పోయే వాళ్లను ఎలాగూ ఆపలేరు కాబట్టి.. వాళ్లతో పాటు సజ్జల కూడా తన దారి తాను చూసుకుంటే సంతోషిస్తామని నేరుగా చెబుతున్నారు. పార్టీలో అదీ సాక్షి టీవీలోనే ఇలాంటి ధిక్కార స్వరం వినిపించిందంటే..ఇక బయట పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డిపై అసంతృప్తి తీవ్రంగా ఉంది. తప్పుడు పనులన్నింటికీ ఆయనే సలహాదారుడని ఎక్కువ మంది ఆరోపణలు చేసేవారు. మంత్రి వర్గాన్ని మార్చినప్పటి నుంచి పెరిగిన అసంతృప్తి.. అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు వచ్చే సరికి పీకల వరకూ చేరిపోయింది. కానీ జగన్ వద్ద ఆయనకు ఉన్న పలుకుబడి చూసి ఆగిపోయారు. పార్టీ ఓడిపోయిన తర్వాత అత్యధిక మంది సజ్జల రామకృష్ణారెడ్డినే నిందించారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీ సమావేశాల్లో జగన్ పక్కనే కనపడుతూండటంతో క్యాడర్ లో అసహనం పెరుగుతోంది.
ఇప్పుడు చాలా మంది పార్టీని వీడిపోతున్నారని.. ఇంత ఘోరమైన ఓటమి తర్వాత ఎవరూ ఉండాలనుకోరేని…ఉండేలా చేయలేరని ఫిక్సయిపోయారు. అయితే ఎంత మంది పోయినా.. వారితో పాటు సజ్జల కూడా పోవాలన్నది ఎక్కువ మంది డిమాండ్. కానీ సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం గెంటేసినా పోయేది లేదని.జగన్ సీక్రెట్స్ అన్నీ తనకు తెలుసన్నట్లుగా నింపాదిగా ఉన్నారు. వైసీపీ క్యాడర్ ఆయన కనిపిస్తేనే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తోంది. అయినా భరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.