ఓ సినిమా టీజర్, ట్రైలర్ చూసి కథేంటో ఊహించేయొచ్చు. అలా ఎప్పుడైతే ఊహలు మొదలవుతాయో, అప్పటి నుంచే ఆ సినిమాపై రకరకాల గాసిప్పులు కూడా మొదలైపోతాయి. ఫలానా సినిమాకు కాపీలా ఉందే..? అంటూ ఆరాలు పుట్టుకొస్తుంటాయి. ‘సరిపోదా శనివారం’పై కూడా అలాంటి గాసిప్పులు పుట్టుకొచ్చాయి. మల్లాది రాసిన ‘శనివారం నాది’ అనే నవలను కాపీ కొట్టి ఈ సినిమా తీశారంటే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని దర్శకుడ్ని కూడా అడిగారు ఓ ప్రెస్ మీట్లో. ‘అసలు అలాంటి నవల ఉంది అని నాకు తెలీదండీ’ అని ఆయన సమాధానం ఇచ్చారు.
ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ విడుదలైంది. కథేంటో పూర్తిగా తెలిసిపోయింది. ఆ నవలకూ, ఈ సినిమా కథకూ ఎక్కడా పోలిక లేదు. ‘సరిపోదా శనివారం’లో హీరో తన కోపాన్ని ఒకరోజు మాత్రమే చూపిస్తుంటాడు. ‘శనివారం నాది’ ఓ సైకో కథ. ఆ సైకో ప్రతి శనివారం అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తుంటాడు. తనని ఎలా పట్టుకొన్నారు అనేదే కథ. ఆ నవలకూ, ఈ సినిమాకూ ఎక్కడా పోలిక లేదు. ఒక్క శనివారంలో తప్ప. కాబట్టి నాని సినిమా కాపీ ముద్ర నుంచి తప్పించుకోగలిగింది. కాకపోతే.. ఈ సినిమా పేరు చెప్పి, వచ్చిన రూమర్ వల్ల.. ‘శనివారం నాది’ అనే నవల ఉందన్న విషయం ప్రాచూర్యంలోకి రాగలిగింది.