ఏపీలో ఒకరోజు ముందే ఫించన్ల పంపిణీ షురూ అయింది. ఎన్టీఆర్ భరోసా ఫించన్లను ఈ నెల 31(శనివారం) పంపిణీ చేసేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం లబ్దిదారులకు ఫించన్లను పంపిణీ చేస్తున్నారు.. అయితే, సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఫించన్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వైసీపీ హయాంలో వాలంటీర్లతో ఫించన్లను పంపిణీ చేస్తే.. కూటమి సర్కార్ సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే , సెప్టెంబర్ 1న ఆదివారం ఉద్యోగులకు సెలవు దినం కావడంతో వారి సెలవుకు భంగం కలగకుండా ఉండేలా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒకరోజు ముందుగానే ఏపీలో ఫించన్ల పండగ వచ్చేసింది. మరోవైపు, ఇతరత్రా కారణాలతో శనివారం ఫించన్లను అందుకోలేకపోయిన వారికి సోమవారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రతి నెల స్వయంగా ఫించన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు ఈసారి కర్నూల్ జిల్లాలో ఫించన్ అందజేయనున్నారు. ఓర్వకల్లులో లబ్దిదారులకు ఫించన్ పంపిణీ చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమడ గ్రామంలో చంద్రబాబు ఫించన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. అక్కడ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఓర్వకల్లులో సీఎం ఫించన్ పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యాహ్నం రెండు గంటలకు ఓర్వకల్లు చేరుకొని అక్కడ ఫించన్ పంపిణీ చేసిన అనంతరం చంద్రబాబు గ్రామ సభలో ప్రసంగించనున్నారు.